"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

20 డిసెం, 2009

ఆ గదిలోనే....ఆమె ..

ఆ గదిలోనే,
ఒక నవ యవ్వన యువతీ, హంస లాగా తెల్లని గౌను వేసుకుని, కూని రాగాలు తీస్తూ, లేడి లాగా పరుగులు తీస్తూ , అందరికి సేవలు అందిస్తూ తిరిగింది
ఆ గది లోనే,
మరో నవ యవ్వన యువకుడు, రోగాలు నయం చేసే డాక్టర్ తో చూపులు కలిపింది ,
ఆ గది లోనే,
ముసి ముసి నవ్వులు తో ,చూపులు కలిపి, ఆత్మీయ ,అనురాగ స్పర్శ తో, తనువు పులకరించింది , ఊహలు ,ఆశల పందిరులు వేశింది,
ఆ గది లోనే,
ఒక ప్రేమ పొదరిల్లు కి సోపానాలు, ఒక చిట్టి పాప కోసం, వెచ్చని ఊయలలు, మదిలో అల్లుకున్నది,
ఆ గదిలోనే,
ఆ గది లోనే,
ఒక, అర్ధ రాత్రి, ఒక రాక్షస  రాత్రి, ఒక నిశి రాత్రి, ఒక మానవ పిశాచం , పాశవిక బలం తో, ఒక గొంతు నులిమింది ,
ఆ గది లోనే,
ఆమె, ఒక మానవిత , ఒక సేవ మనస్కురాలు, అదే ఆమె తప్పా??? అదే హాస్పిటల్ లో పని చేసే ఒక వార్డ్ బాయ్ ఆమె కలలు, ఆమె జీవితం, ఆమె లో జీవాన్ని క్రురంగా నలిపి పారేసాడు,
ఆ గదిలోనే,
ముప్ఫై ఆరేళ్ళు గా, ఒక మంచం మీద, చేతులు కొంకర్లు పోయి, కాళ్ళు వంకర పోయి,నోరు  మూగ బోయి, ఒక నిర్జీవ, నిస్చేతన ,అవస్థ లో, ఒక సమాధి లో ఉన్నదీ,
ఆ గది లోనే,
ఆడ వాళ్ళు అంటే అలుసు గా, మగ వాళ్ళు ని పెంచే యీ సమాజం లో, ఆమె ఒక సవాలు గా నిలిచింది , తన ప్రాణం , తనకు ఒక బరువు గా తయారు అయి, చేతులు, కాళ్ళు, సర్వ అవయ వాలు, నిస్చేతనం గా ,ఒక  vegetable లాగ, ఊపిరి పీలుస్తోంది,
ఆ గది లోనే,
ఎందు కమ్మా నువ్వు చని పోతాను అని కోర్టు ని పర్మిషన్ అడిగావు.. ఎక్కడ ఉండమ్మా నీలో జీవం  ఇంకా??
ఆ గది లోనే,
నువ్వు ఉండాలి అమ్మ, యీ సమాజం సిగ్గు తో తల దించు కునేలా, మానవత్వం అంటే, మగ వాళ్ళే కాదు, ఆడ వాళ్ళు కూడా ఉంటారు, ఆడ వాళ్ళు మనుషులే, జీవించే హక్కు, కలలు కనే హక్కు, నడిచే హక్కు, ఊపిరి పీల్చుకునే హక్కు, మాకు ఉంది అని చెప్పడానికి,
ఆ గది లోనే,
నువ్వు జీవించు అమ్మ, యీ సమాజం ని ఎడమ కాలి తో తన్ని, ఆ మంచం మీద ఊపిరి పీలుస్తూ, జీవించు అమ్మా.
ఆ గదిలోనే..
నీ ప్రాణం, నీ జీవితం, నీ హక్కు..
ఆ గది లోనే, జీవించు అమ్మ..
సభ్య సమాజం తల దిన్చుకుంటుంది, నువ్వు తలఎత్తి  జీవించు అమ్మ,
ఆ గదిలోనే....

16 డిసెం, 2009

సినిమాలు, నగలు,మరపు...

సినిమాల్లో అసలు సినిమా కన్నా, ముందు చూపించే సినిమా ఆడ్స్  ఎంత బాగుంటాయో?? ఒకే టికెట్ మీద బోలెడు  సినేమాలు చూసిన ఆనందం వేస్తుంది. అందులో ఇంగ్లీష్ సినమాలు అయితే మరి బాగుంటాయి. ఒకటో, పదో, చూపిస్తారు. యీ సినిమాలు అన్నీ తప్పక చూడాల్సిందే అనుకుంటాము. బయటకి రాగానే మర్చి పోతాము. ధగ ధగ లాడే బంగారం కొట్టుకి  వెళ్తే ,  ఏ  నగ చూసినా ఎంత బాగుందో, యీ సారికి, యీ చిన్న పోగులు, తో సరి గాని, వచ్చే సరి, బోలెడు డబ్బు తెచ్చి యీ నగ ఎలాగైనా కొనాలి అనుకుంటాము. బయటకి రాగానే మర్చి పోతాము . ఇంకా చీరల షాప్ కి వెళ్ళితే,  వెయ్యి రూపాయల చీర కోసం వెళ్ళితే ,రెండు వేల చీర నచ్చుతుంది ఎన్ని చీరలో , నచ్చిన వన్ని కొనడానికి మళ్లీ రావాలని అనుకుంటాము. బయటకి రాగానే మర్చి పోతాము. పత్రిక లో వంటలు చదివి ,అన్నీ చేసేసి ఇంట్లో వాళ్ళని మెప్పించాలి అనుకుంటాము. పుస్తకం మూసేయగానే మర్చి పోతాము ఇంట్లో వాళ్ళు దణ్ణం పెట్టుకుంటారు రహస్యంగా..టీవీ లో వంటలు చూసి చేసేయడం ఇంకా సులువు, అనుకుంటాం.. అమ్మయ్యా. టీవీ ఆఫ్ చేయగానే, మళ్లీ అన్నీ మర్చిపోతాం. యీ మరుపు మనకి చాల మేలు చేస్తుంది. అప్పటి కప్పుడు ఎన్నో అనుకుంటాం. మరో రోజు కి మర్చిపోతాం  లేక పోతే, మనం రోజు సినిమాలు, నగలు, బట్టలు అంటూ పిచ్చి పట్టించే వాళ్ళం కదా..


ఇలాగే ఆస్తా టీవీ లో రామ్దేవ్ యోగ చూస్తూ, మనం రోజు ఇంకా తెల్ల వారే లేచి, ప్రాణాయమం   చేయాలి, ఆసనాలు వెయ్యాలి అనుకుంటాం. టీవీ ఆఫ్ చేసి మరిచి పోతాం. అందరు  బీచ్ రోడ్ లో ఎంత బాగా నడుస్తున్నారో , ఎంత మంచిదో నడక అని పొద్దున్నే అనుకుంటాం, సాయం త్రానికి , మళ్లీ మరిచి పోతాం. మనం ఏమి చేయగలం.. మరపు మనకి ఒక వరం మరి.. లేక పోతే ఒక్కసారి ఆలోచించండి.. రోజు సినిమాలు, నగలు, బట్టల కోట్లు, వంటలే మరి...


ఇంకా అమ్మ నాయనో, జనవరి ఒకటి వస్తుంది. కొత్త డైరీలు కొని, కొత్త కలం కొని,  రంగు రంగు లలో, కొత్త సంవత్సర నిర్ణయాలు రాయాలి. సినిమాలు తక్కువ చూడాలి, నగలు వ్యామోహం, వదిలేయాలి, బీరువాల్లో ఖాళీ లేదు ,కొత్త చీరలు కొనడం తగ్గించాలి, కొత్త వంటలు నేర్చుకుని ఇంట్లో వండి పడేసి, హోటల్లు కి వెళ్ళడం తగ్గించాలి..హమ్మ, హబ్బ.. బరువు పెరిగింది, బరువు తగ్గించాలి.. టైలరు  ముందు పరువు పోతోంది, మీటర్ న్నర కావాలిట ఇప్పుడు..యోగ చేయాలి, నడవాలి ,  తిండి  తగ్గించాలి,ఒక ప్పది కేజీల బరువు తగ్గాలి, అన్నిటి కన్నా ముందు,  రోజు సూర్యోదయం చూడాలి, ఇలాగ, పోద్దేకే దాక నిద్ర మానేయాలి...హా హవులింతలు  వస్తున్నాయి. .. నిద్ర ఎంత సుఖామో అని పాడేయడం మానేయాలి, నిద్రే దరిద్రం ట.. పొద్దున్నే లేవాలంటే, రాత్రి ఇంకా పెందరాలే మంచం ఎక్కేయాలి, ఇంకా మొత్తం.. జీవన విధానమే మార్చు కోవాలి ట.
ఇంకా ఉడికించిన కూరలు తినేయాలి, నెయ్యి, నూనే మానేసి.. సగం హాని వాటి వల్లే ట. అవేం చేసేయో పాపం. ఇంకా రాజు గారు మా టీవీ లో చెప్పినట్టు, ఉప్పు లేని భోజనం, రోజు ఆకూ కూరలు, కారట్టు లే ఫలహారం ట,కాఫ్ఫీ లు, టీలు మానేసి, మంచి నీళ్ళు తాగాలిట. ఉండ గలిగితే ఉపవాసం ఉండాలిట, వారాని కి ఒక్క రోజు, అప్పుడే మూడూ మారు ఆకలి వేస్తోంది, యీ రోజు, ఇవ్వన్ని చేస్తే, సగానికి  కి సగం తగ్గుతాను .. నన్ను నేను బ్రెయిన్ వాష్ చేసుకుని , ఇవన్ని మంచివి అని తల కి ఎక్కించుకుని, ఇదిగో, యీ జనవరి ఫస్ట్ నుండి  అన్నీ త్రికరణ శుద్ధి గా చేస్తాను అని డైరీ లో రాసుకున్నాను..
యధా ప్రకారం, మనకి వరమైన మరపు, మనలని రక్షిస్తుంది, మళ్లీ జనవరి ఫస్టు వరకు....
లేక పోతే, సినిమాలు, నగలు, బట్టలు అని సతా యించే వాళ్ళం కదా, మన మరుపే  మనకి వరం అంటాను...అందుకే మరి.....ఉండనా    మరి..

11 డిసెం, 2009

మన ఇల్లే స్వర్గం.

దూర ,దూర ప్రయాణాలు చేసి, కొండల ఒడ్డున, సముద్రం తీరాన గల, మా ఊరు చేరగానే, మనసు, మల్లెలు తాకినంత మత్తుగా  ఎందుకు అవుతుందో? ఇంకా ఆ రోడ్డు మలుపు తిరిగి, ఆ అప్పు మీద నుంచి లోతుకి కనిపించే ఆ నీలి కాన్వాస్ , గంభిరంగా, ఇంట్లో పెద్దవాళ్ళ లాగా పల రిస్తుంది, బాగున్నావా అంటూ..రోడ్ద్ అంత కొత్త గా అనిపిస్తుంది ఒకసారి, తెలిసిన దే కదా, అని ఇంకో సారి, యీ వీధి మలుపులో బడ్డి కొట్టు అలాగే ఉంది, ఆకూ కూరలు వాళ్ళు అలాగే అరుస్తున్నారు, పని వాళ్ళు అలాగే ఒక ఇంటి నుండి ఒక ఇంటికి పరుగులు పెడుతున్నారు,వాచ్ మాన్, పలకరింపులు,
తలుపులు తెరచి ఇంట్లో అడుగు పెడితే,చందనం కలిపినా సువాసన తో, ఇల్లు పలకరించింది.. జ్ఞాపకాల చందనం అనుకుంటాను..ఇల్లు అలాగే ఉంది.. అది ఏమి మారుతుంది.. నిశ్సబ్దంగా అన్నిటినీ పరిశీలించే గోడల సమూహం కదా.. అనుకున్నాను, నేనే పలకరించాను, నేనే .. వచ్చింది నేనే అని చెప్పాలి కదా. ఇంతలో కరెంటు పోయింది, దోమలు కుట్టి మరి పలకరించాయి.. పాతరక్తం వాసన కి ఆనందిస్తూ..ఇరవై నాలుగు గంటలు ఏసీ , తెల్లని స్వచ్చ  మైన గోడలు, బాదర బంది   లేని ఇల్లు, బిల్లులు తో మనకు సంబంధ మే లేదు.. అయినా. ఎందుకు ఇక్కడికి పరుగులు పెట్టి రావాలని అనిపిస్తుంది. కరెంటు  పోతుంది, బిల్లులు కట్టాలి, పెట్రోల్ డబ్బులు పెట్టి పోయించాలి,రోడ్డు సరే సరి. ట్రాఫ్ఫిక్ రూల్స్ పుస్తకాల్లో ఉంటాయి. మండే ఎండలు, కారే చమటలు, ఒకటే ఉక్కపోత, రాష్ట్ర బంద్ లు , రైళ్ళు లేట్, ఫ్లిఘ్త్స్ లేట్, సమయం అంటే లేఖే లేదు, యీ దేశం, యీ రాష్ట్రం, యీ ఊరు ఇంకా మారవు అని తిట్టుకుంటాను, అయిన, యీ ఊరే నా ఇల్లు అని పిస్తుంది.
ఈ గాలి,  ఈ పలక రింపులు , ఈ మట్టి, ఈవాసన, ఈ కొండలు, ఈ నిశ్చింత,ఈ సముద్రం, ఈ నీలం, ఈ మనుషులు, ఈ ప్రేమలు, ఈ స్నేహాలు, ఈ బంధాలు, ఈఊరు.. నా ఊరు..
ఇంట్లో కరెంటు లేదు, నా మొహం మటుకు వెలిగి పోతోంది.
మన ఇల్లే స్వర్గం.. అని పాట ఏదిఐన  ఉందా పాడుకుందాం...

3 డిసెం, 2009

వలస పక్షులం .

అర్ధరాత్రి  వస్తారు, ఈ వలస పక్షులు.. కలల ను సాకారం చేసుకోవడానికి దూర తీరాలు, వెళతారు ,మూడేళ్ళు కి ఒకసారి, మనసు మళ్ళుతుంది. అమ్మ ని చూడాలి, జన్మ భూమి ని చూడాలని, స్నేహితులు ని పలకరించాలి, తమ విజయాలు ని అందరి తో పంచు కోవాలని. పెద్ద, పెద్ద సూట్కేస్ లు మోసుకుంటూ వస్తారు, ఐ పాడ్లు, బాగులు, పెన్నులు,పూసలు, ఇంకా ఏవేవో మోసుకుని వస్తారు అందరికి తల ఒక గిఫ్ట్. ఖాళీ  అయిన వాటిని మళ్లీ నింపాలి కదా పచ్చళ్ళు  పొడులు, స్వీట్స్ తో. ఇది ఒక నిరంతర ఇచ్చి  పుచ్చుకోవడం..
ఇంక మొదలు ...ఉరుకులు పరుగులు, చుట్టాల ఇంటికి, దూర బంధువుల పెళ్ళిళ్ళు, దగ్గర బంధువుల పుట్టిన రోజులు, అమెరికా కెమెరా కన్ను లో అందరు పడాలి కదా, ఇంకా బజార్లులు కి రోజు పరుగులు, అర్ధ రాత్రి  వరకు షాపింగ్, బట్టల షాపింగ్, బంగారం షాపింగ్,చెప్పుల షాపింగ్,గిఫ్ట్స్ షాపింగ్,స్టీలు గిన్నెలు, కుక్కర్  గిన్నెలు,   కాఫీ ఫిల్టర్లు, తెలుగు కథల పుస్తకాలు, సీడీలు ,పచ్చళ్ళ ప్యాకింగ్, ఇంకా ముఖ్యం గా   టై లర్  చుట్టూ ప్రదక్షణలు, ఇంకా ఇండియా లో టైలర్లు కి ఇంత ప్రాముఖ్యం ఉందా అని తెలుసుకుంటారు. వీసా, పాస్ పోర్ట్,టికెట్ ఉండడం కాదు, ఈ టైలర్ సమయానికి నీ డ్రెస్సులు, జాకెట్లు ఇవ్వడం మీద ఉంది, నీ ప్రయాణం అని కూడా తెలుసు కుంటారు. రోజూ , దేవుడు ని పొద్దున్నే వేడుకుంటారు, నా బట్టలు సమయానికి వచ్చేలా చేయి స్వామి అని, నీ ఉద్యోగం కోసం కూడా అంత ప్రార్ధించి ఉండవు. ఒకొక్క సమయం లో ఒక్కొక్కరు కి ఎంత ప్రాధాన్యం వస్తుందో, నీకు అర్ధం అవుతుంది. టైలర్ అని తక్కువగా ఇంకెప్పుడు చూడవు..మధ్యలో, తిరుపతో, ఇంకో దేముడు తోనో నువ్వు చేసుకున్న ఒప్పందం  గుర్తు వస్తుంది. చిలుకూరి బాలాజీ చుట్టూ ప్రదక్షణలు ఉన్నాయి.. ఎలాగు..ఇంకా , చిన్న చిన్న కష్టాలు కి చిన్న చిన్న దేముడు లతో మొక్కులు ఉన్నాయి, నువ్వు చదివిన స్కూల్ టీచరులు ని కలవాలి, వీలు అయితే, నువ్వు పుట్టిన పల్లెటూరో, చిన్న ఊరో వెళ్లి, నీ ఫేస్ బుక్  ఫ్రెండ్స్ కోసం ఫోటోలు తీయాలి, ఇంకా, ఊటీ వెళ్ళాలి, లేదా అరకు వెళ్ళాలి, పిల్లలు ఉంటే తాజ్ మహల్ చూపించాలి, రాజధాని ఢిల్లీలో తిప్పవద్దూ .. షిరిడి, శ్రీశైలం.. అన్నీ ఈనెల లోపే..
ఇంత లో , ఈ దుమ్ము, వేడి కి జ్వరాలు, దగ్గులు వస్తాయి, ఈ ఇండియా ఎప్పుడూ బాగు పడుతుందో, అనుకుంటూ, ఇబ్బంది పడతావు, వీధి చివర డాక్టర్ ఫరవాలేదా, అపోలో కి వెళ్ళాలా  అని ఆలోచిస్తూ ఉండే లోపు  నీ లీవ్ అయిపోతుంది..
అమ్మో అప్పుడే అయిపొయింది, ఇంకా ఏలూరు పిన్ని ,బెజవాడ అత్తా, రాజమండ్రి మావయ్యల ను చూడనే లేదు, ఏమి అంటారో? ఒక్క తెలుగు సినిమా ధియేటర్ లో చూడాలి అనుకున్న.. ఫ్రెండ్స్ తో పార్టీ అనుకున్నా..బీచ్ లో లాంగ్ డ్రైవ్ అనుకున్నా, ట్యాంక్ బండ్  మీద ఐస్ క్రీం అనుకున్నా, మూడు ఏళ్ళు ఎన్ని కలలు కన్నాము ..
అప్పుడే, సామాను  ప్యాక్ చేసుకునే టైం వచ్చింది. అమ్మబాబోయ్ , ఈ సామాను అంతా ఎలా సర్దడం? ఎంత బరువో? అమ్మో నేను కూడా ఇంత పెరిగాను, నా జీన్స్  లోకి పడతానా? మళ్లీ ఎప్పుడూ వస్తానో, మళ్లీ ఎప్పుడూ తిరుగు తానో ఈ వీదుల్లో, ఈ ఆటో ల లో, ఈ కిక్కిరిసిన సజీవ రోడ్డులు మీద ?  ఎలా వదిలి వెళ్ళడం, నేను పుట్టి పెరిగిన ఊరు , దుమ్ము ధూళి ఉన్న ఈ మట్టి వాసన ఎంత బాగుంటుంది? ఈ భూమి ని వదలి ఎలా వెళ్ళడం? కాని అక్కడ రోడ్డులు ఎంత బాగుంటాయి, గాలి ఎంత స్వచ్చం గా ఉంటుంది, డాల్లర్లు,సుఖాలు ,గుర్తు వస్తాయి.
ఈ దేశం లో పుట్టాను, అక్కడ ఎక్కడో బతుకుతున్నాం, ఇక్కడ జ్ఞాపకాలు కావాలి, ఇక్కడ ప్రేమలు కావాలి, ఇక్కడ మట్టి వాసన కావలి, ఇక్కడ సంస్కృతి కావలి, ఇక్కడ పండుగలు, ఇక్కడ దేముడులు కావాలి.. కాని, అక్కడ డాలర్లు  కావాలి..
అన్నిటిని వదులుకుని మళ్లీ అర్ధ రాత్రి ఎక్కుతాము .... ఇక్కడ అర్ధ రాత్రి ,కాని అక్కడ ఇంకా ఉదయమే కదా..
మళ్లీ , మళ్లీ, వస్తూ పోతూ  ఉంటాము వలస పక్షులం కదా..

1 డిసెం, 2009

నీ పుట్టుక లోనే, నీ భవిష్యత్తు...

నీ పుట్టుకే నీ భవిష్యత్తు నంతా నిర్ణయిస్తుంది, అందులో మన గొప్పతనం, ఏది లేదు అనే చెప్పవచ్చు.నువ్వు ఒక మధ్య తరగతి , మామూలు కుటుంబంలో పుట్టినా నీకు తిండి కి లోటు ఉండదు, మూడో  ఏడు రాగానే బడి లో వేస్తారు, నీ అంతట నువ్వు పని గట్టుకుని చదువు మానేస్తే తప్ప, నువ్వు చదవగలిగినంత నీ తండ్రి, నిన్ను అప్పు చేసి అయినా చదివిస్తాడు . అర్ధ రాత్రి ఇంటికి వచ్చినా నీకు కంచం లో అన్నం ఉంటుంది. నీ తాత గారు, సైకిల్ తొక్కి పని లోకి వెళితే, నీ తండ్రి స్కూటర్ మీద వెళతాడు , నువ్వు ఒక చిన్న మారుతీ కార్ కొనుక్కుంటావు..ఇవి అన్ని  చెప్పడానికి జ్యోతిష్యం  రానక్కర లేదు.
నువ్వు పుట్టిన  కుటుంబం నీ చరిత్ర చెబుతుంది.
ఇంకొకడు, ఒక చెప్పులు కుట్టే ఒక చర్మకారుడి  ఇంట్లోనో, లేక ఒక చేపలు పట్టే ఒక జాలరి ఇంట్లోనో పుట్టాడు, లేదా అడవి లో నివసించే ఒక గిరిజనుడి ఇంట్లో పుట్టాడు, వాడి జాతకం చెప్పడం అంత తేలిక కాదు.
 ప్రతి రోజు ఒక గండమే . బతికి మూడు ఏళ్ళు రావడమే వాడి అదృష్టం. మూడు ఏళ్ళు వచ్చాక  ఏమి చేస్తారు.. బడి లో మటుకు పడేయరు,   మన పిల్లాడి కి లాగా, వీడికి ఇంకా మూడు పూటలా అన్నం ఎలా పెట్టాలి అని ఆలోచనలో పడతారు ఈ లోపల వాడు , అరుగు ల మీద, రోడ్ మీద, చెత్త కుప్పల మీద, అడవి లోనో, సముద్రం అలల మీదో ,ఆడుకుంటూ, పెద్ద పిల్లలని చూస్తూ  పెరుగు తాడు, బడి లో పడేయడమా?? పని లోకి పంపడమా  ? అని ఆలోచన లో పడతారు, ఎక్కడో ఏదో విని, చూసి, వాడికి చదువు అనే పని నచ్చితే , బడికి వెళ్ళతాడు ,  లేక పోతే, బడి అంటే శిక్ష అనుకుని  ఎగ్గొడతారు, బడి కి వెళ్ళిన, ప్రభుత్వ పాఠశాల లో, మాస్టర్లు ఉండరు, ఆడింది ఆట, పాడింది పాట గా పెరుగుతారు. పదో తరగతి ఒక పెద్ద గండం.
అది గట్టెక్కడం ఒక పెద్ద ఘనకార్యం. మళ్లీ, మామూలు గానే, పని లో పడేద్దాం అంటాడు  తండ్రి. ఇంకా ఎవరు చదివిస్తారు? గంజి పోయడమే కష్టం అంటాడు. అతనికి చదువు అంటే ఇంకా ఇష్ఠం  మిగిలితే, ప్రభుత్వ హాస్టల్ లో ఉండి  చదువుతాను అంటాడు, పిల్లవాడు గట్టిగ కోరుకోవాలి, సీట్ దొరకాలి, ఊరి కి మరీ  దూరం గా ఉండకూడదు, ఇన్ని బాలారిష్టాలు దాటితే, మళ్లీ చదువు మొదలు అవుతుంది.
 పుస్తకాలు ఉండవు, స్నానం కి నీళ్ళు ఉంటే మహా భాగ్యం,రెండు పూటలా తిండి పెడితే, ఇంకో భాగ్యం, ప్రభుత్వ అతిథులు కదా, ఎవరికీ చెందరు. మన ఇళ్ళల్లో, పిల్లలు అన్నం వదిలేస్తారు.అమ్మ లు కుక్కి, కుక్కి పెడతారు.
ఆ హాస్టల్స్ లో   వాళ్ళకి ఆ అన్నమే పరవాన్నం.చీమలు పట్టిన, పురుగులు పట్టిన అన్నం, దోమలు పట్టి పీడించే రాత్రులు, అలుసు గా పీడించే పెద్ద ఇళ్ళ పిల్లలు, మీకు అన్నీ ఫ్రీ కదా అని ఏడిపించే పిల్లలు, మీకు మార్కులు రాక పోయిన ఫరవా లేదు, సీటులు గారంటీ అనే మాస్టారులు, వోటులు కోసమే పనికి వచ్చే ఈ పథకాలు లో మాకు వచ్చే ఏ ఉపయోగం గురించి మీరు అంత మమ్మల్ని కట్టకట్టుకుని ఏడిపిస్తున్నారు, అని ఆ పిల్లవాడు, రాత్రి నిద్దరలో ఏడుస్తాడు, ఈ సమస్యల  మధ్య పూట గడవడమే కష్ఠంగా ఎంసెట్ లు, అవీ రాయలి. సీటులు సంపాదించినా మళ్లీ ఫీసులు, పుస్తకాలు, హాస్టల్ , పురుగు లు పట్టిన అన్నం తింటూ,నాలుగు ఏళ్ళు చదవాలి ఒక ఇంజినీరు  అవడానికి. అడుగడుగునా, అనుమానాలే, అవమానలే, ఈ అబ్బాయికి. వీడి భవిష్యతు చెప్పడం.. చాల కష్ఠ మైన పనే.
ఇదే ఒక మామూలు  మధ్య తరగతి పెద్దింటి పిల్లాడికి, మారుతి కొంటాడా ఫోర్డ్ కొంటాడా ? వాడు పెద్ద వాడు అయి  అని చెప్పడం .. ఒక కష్టం  కాదు, వాడు, పుడితే, ఇదీ నిజం అవుతుంది...
చెప్పాను  కదా, నీ గొప్పతనం కాదు, నీ పుట్టుక గొప్పతనం అంతా
నీ పుట్టుక లోనే, నీ భవిష్యత్తు అంతా ఉంది.
ఆక్సిడెంట్ గా మనం ఒక కుటుంబం లో పుడతాం ..ఏదో, ఒక గొప్ప కులం అని సంబర పడి పోవడానికి ,మన గొప్ప తనం ఏమి లేదు.
ఇది గ్రహించి మెలిగితే, ఎవరూ తక్కువ కారు..అని తెలుస్తుంది.
ఇవాల్టికి కూడా రెండు గ్లాసుల పధ్ధతి ఉండి అని తెలిసి, అంబేద్కర్ విగ్రహానికి ఒక వాడి పోయే పూల దండ ఒకటి వేస్తె సరి పోదు..
ఇంకా ఏదో చేయాలి, చాల చాల చేయాలి. అవును అరవై ఏళ్ళు చాలవు ఇంతటితో సరిపోదు వారికి ఇంకా సంపూర్ణ న్యాయం జరిగే వరకూ .. ఈ రెసెర్వెషన్లు కొనసాగాలి .