"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

21 సెప్టెం, 2010

కాలం కి గాలం వేద్దాం ...

అద్దం లో చూసు కుంటే, ఏడుపు వస్తుంది, వెండి లా మెరుస్తూ అక్కడక్కడ అని మనం అనుకుంటాం, నలుపే ఎక్కడో దాక్కుంది అనేది అసలు నిజం. పిల్లల తల్లులు కూడా, ఆంటీ అంటారు, ఇంక ఆ పిల్లలకి అమ్ముమ్మ లమే కదా , ఇదేమిటి ఇలా విరుచు కు పడి పోయింది ఈ యాభై లలో వయసు..పిల్లలు , ఇంక పిల్లలే కాదు, పెద్ద వాళ్ళు అయిపోయారు, సినిమాలు , షికార్లు, షాపింగ్ అన్నీ వారే .. పర్సు లో డబ్బులు అయి పోతేనే అమ్మా అన్టూవస్తారు. మొన్నటి వరకు మన వెనక కూర్చుని, స్కూటర్ మీద, నడుం పట్టుకుని కూర్చున్నవారే అమ్మా నువ్వు వెనక కూర్చో, నేను డ్రైవ్ చేస్తాను అంటున్నారు. 
ఎప్పుడో జ్వరాలు వస్తే పిల్లలకి డాక్టర్ ల దగ్గరకి వెళ్ళే వాళ్ళం, ఇప్పుడు, కాళ్ళ నొప్పులు, ఇంక ఏవో బాధలు, ఏ పరీక్షలు చేయకుండానే, బరువు తగ్గండి అని కాగితం మీద రాసి ఇచ్చేస్తారు ,అదే మందు ట.సరే మొన్నటివరకు షుగర్ అంటే పంచదార , యీ మధ్య వరకు, రేషన్  షాప్   లో పనిమనిషి కార్డ్ కూడా పట్టుకుని వెళ్ళి తెచ్చుకునే తెల్లని, తీయని పదార్ధం. ఇప్పుడు అదేదో, మన శరీరం లో పుట్టిన రోగంట. షుగర్ అంటే, తీపి పదార్ధాలు పూర్తి గా మానేయాలి ట. పిల్లలు కోసం అని ఏ పండుగ వచ్చినా ఒక పాయసమో, చక్ర పొంగలో చేసి టేబుల్ మీదపెట్టి, అయింది పండుగ అనిపించే వాళ్ళం. 

ఇప్పుడు, తీపి తినాలని ఒకటే పీకడం. ఏదైనా పెళ్లి కో పేరంటాని కో వెడితే, ముందు అక్కడ ఏం పిండి వంటలుచేసారో, అని తొంగి చూసి, అయ్యో ఇలాగ అయిపోయేం ఏమిటి అని సిగ్గు పడడం, ఏమిటో ఈ శరీర అవస్థ. వద్దు అన్నదే తినాలని అనిపిస్తుంది.ఏమిటో ఈ ఏభై అవస్థలు. 
దేవుడు ముందు కూర్చుని, ఏదైనా చదువుదామని  మొదలుపెడితే, దేవుడే ప్రత్యక్షం అయి నాకు ఏ
ప్రసాదం పెడతావు అని అడిగినట్టు అనిపిస్తుంది. ఇవి కాక ఇంకా చాల కష్టాలు పుట్టు కొచ్చాయి.
ఆఖరికి టైలర్, కొంచం స్టైల్ గా కుట్టవయ్యా, మరీ అలాగ  ఓల్డ్ ఫాషన్ గా కుడుతున్నావు అంటే, మీకు అంత బాగుండదు, అన్నట్టు ఓ లుక్ ఇచ్చి, మీకు ఇలాగే బాగుంటుంది అని తేల్చేస్తాడు. 
పిల్లల చదువులు అయి ఉంటే, ఇంకో కష్తం, మీఅబ్బాయో, అమ్మాయి పెళ్లి ఎప్పుడు చేస్తారు అని అందరు విచారించడమే, అమ్మా మేము ఇలాగ హ్యాపీ గా ఉండడం ఇష్టం లేదా అన్నట్టు చూస్తారు, మనమే చూడాలా? వాళ్ళే చేసు కుంటారా? అయ్యో,వయసు అయిపోతోంది  కదా, మెడలు వంచి అయినా చేయాలా? ఛా  ..అమ్ముమ్మా లాగా ,పాత చింత కాయ ( చాల రుచి గా ఉంటుంది లెండి) లాగ ఎలా ఆలోచిస్తాం, ఏమిటి రోజులో ఇన్ని గంటలు ఉన్నాయి, పిల్లల బడులు,పరీక్షలు , ఉన్న రోజులు ఎంత బాగుండేవి, అప్పుడు తిట్టుకునే వాళ్ళం,తెలియక, ఎప్పుడూ అంతే ,అయి పోయిన రోజులు మంచివి అనుకుంటాం, ఆ రోజుల్లో మటుకు, ,వాటివిలువ తెలియదు.
అవునుకదా,    ఇప్పుడు మటుకు ఏం అయింది? సగం ఖాళీ గా ఉన్న గ్లాస్ , ఇది, ఇంకా సగం జీవితం ముందు ఉంది.
యోగ   చేయాలి, కాళ్ళ మీద బరువు తగ్గిస్తే, అన్నీ జబ్బులుతగ్గు తాయి ట. నడక మొదలుపెట్టాలి, పుస్తకాలు చదవాలి, స్నేహితులనికలవాలి, ఇన్ని సంవత్సరాలు కుదర లేదు  కదా, రుచుల మీద కోరిక తగ్గించుకుని, అన్నిటి కన్నా ఇదే కష్టం అయింది, ఉప్పులేని, ఉడికించిన రాజు గారి వంటలు చేసుకుని తినాలి, అమ్మో, టీవీ లో చూడ డానికి బాగుంటాయి, కాని తినడానికి బాగుంటాయా? సరే,మధ్యే మార్గం గా ముందు, అన్నం బదులు చపాతీలు తినాలి,లెక్క గా తినవచ్చు కదా.. లైఫ్ స్టైల్ మార్పులు అంటే ఇవేనా?
సరే మరి ఇవాళ షాపింగ్ చేయాల్సిందే,కొత్త డ్రెస్సులు నడక ,యోగ కోసం, బుల్లి కుక్కెర్  ,కూరలు ఉడికించి పడేయ డానికి, పోనిలేపని తగ్గుతుంది, నెట్ లో చూసి కొత్తవంటలు నేర్చుకోవాలి,ఎప్పుడూ ఈ పప్పు, ఈ ముద్ద కూరలేనా?
అయ్యో , ఇవాళ అయినా ఆ పేస్ బుక్ లో రిజిస్టర్ అవాలి, పిల్లలు అక్కడ వాళ్ళ స్టేటస్ అని అందులో రాస్తారు ట, వాళ్ళ మనసులో మాట. 
సరే, తప్పుతుందా, అమ్మ అంటే, ఏదైనా చేయవచ్చు పిల్లలకోసం అని, ఎక్కడో ఉన్నారు, మరి మనసు లో మాట కనీసం ఇలాగ అయినా చెపుతున్నారు..
నెట్,పుస్తకాలు, కొత్త వంటలు,స్నేహితులు, యోగ, నడక, ఇవాల్టికి చాలు, ఇంకా సమాజం-సేవ కూడా ఉన్నాయి ,నా మదిలో, ఇంకో రోజు, ఇంకో జీవితం, ఇంకా సగం జీవితముంది  లెండి మనకి..
అప్పుడే ఏభై పైన సగం  కూడా అయిపోయిందా  ?సరే ఇంక అరవైలు    కూడా ఉన్నాయి జీవితం వద్దు అనుకున్నప్పుడు ఇంతవేగం గా పరుగులు పెడుతుంది 

ఏమిటి??
అదే మరి కాలం ! !కాలం కి గాలం వేద్దాం పదండి..

15 సెప్టెం, 2010

నవ్వి పోదురు గాక నాకేమి సిగ్గు.



మధ్యాన్నం పెళ్లి భోజనంకి వెళ్ళి వచ్చాం. నాలుగైదు బల్లల మీద అమర్చిన పది పన్నెండు రకాల రుచి కరమైన పదార్ధాలు, మరో నాలుగు రకాల కొసరు తీపి రుచులు తృప్తి గా ఆరగించి,భుక్తాయాసం  తో,ఎలాగో ఇంటికి వచ్చి,కళ్ళు మూసు కు పోతూంటే, ఇంక రాత్రి  కి ఏమి తినక్కర లేదు అంటూ మంచం మీద నడుం వాలుస్తూ అనుకోవడం గుర్తు.


నిద్ర లేచి, ఇంకా భోజనం నే తలచుకుంటూ, పెళ్ళికూతురు- పెళ్ళికొడుకు విశేషాలు కి ఇంకా సమయం ఉంది, ఇప్పుడు గుర్తు ఉన్నది, భోజనంరుచుల  విశేషాలే...విప్పి పడేసిన పట్టు చీరలు మడిచి పెట్టుకుంటూ, ఇంకా ఆయాస పడుతూ, ఇంక రాత్రి కి మజ్జిగ తాగిపడుకోవడమే, అని నిట్టురుస్తాం .


సరే, రాత్రి అవుతుంది, మెల్లిగా అరిగి పోయిన భోజనం స్థానం లో ఏం పడేస్తారు ఈ చిన్న పొట్ట లో .. అని అడగడం మొదలు పడుతుంది..


ఆకలి కి సిగ్గు ఉండదు కదా? ఏవో వెతికి వండ డానికి వంటింట్లో కి దారి తీస్తాం మనం అంటే స్త్రీలు అని అర్ధం.


మన దేశం లో కోట్ల మంది కి తినడానికి తిండి ఉండదుట.తిండి  కొన డానికి డబ్బులుండవు, డబ్బులు సంపాదిన్చాద్దనికి పని ఉండదు, పని చేయ డానికి పొలం ఉండదు, పొలం ఉన్న, నీరు సదుపాయం ఉండదు, రోజు కూలి దొరికినా పై పైకి ఎగురుతున్న ధరలు కి సరిపడా కూలి దొరకదు. పట్నం వస్తే పని కోసం, ఉండ డానికి ఇల్లు ఉండదు. పెద్ద లు పస్తు ఉండి పిల్లలికి చాలీ చాలని తిండి పెడతారు. 


మన  ప్రభుత్వం చాల కష్ట పడి పేదరికం తో,తిండి కి కూడా లేని పేదల సంఖ్య ని చాల తక్కువ చేసింది ట. వారి లెక్కల ప్రకారం అన్ని కోట్ల మంది కాదుట,కొన్నే కోట్ల మంది తిండి లేక ఉన్న వారుట.వీరికి కూడా, రెండు రూపాయల గోదుమలో లేక బియ్యమో ఇచ్చే పధకాలు ఉన్నాయిట. ఇంకా ఏమిటి మీ గోల ? అని చాల చికాకు పడుతుంది.


ఇది  చాలక, ఎలుకలు తింటున్న గోధుమలు, గోదాములులేక ఎండా కి వాన కి ఎండుతూ, తడుస్తూ వృధా అవుతున్న తిండి గింజల ను కొందరు ఫోటోలు తీసి, వార్త పత్రికల్లో ప్రచురించారుట. మొదటి పేజీ లో ఈ ఫోటోలు చూసిన మన అత్యంత పెద్ద న్యాయ స్థానం, ఏమిటి ఈ నిర్లక్ష్యం? అని ప్రభుత్వం ని చివాట్లు  వేసిందిట.


ప్రతి పక్షాల కుట్ర అని, పొరుగు దేశం కుట్ర అని కుంటి సాకులు చెబితే ఇంకా ఎక్కువ చికాకు  పడి, ఎవరు మీ  భోజన వ్యవహారాల మంత్రి అని అడిగితే ఆయన కి ఇది ఒక్కటేనా? ప్రపంచం లోనే అతి గొప్ప (ఖరీదు) అయిన ఒక క్రీడ ని ఆడించే పనిలో చాల బిజీ గా ఉన్నారు ఇలాంటి బీద విషయాలను ఆయన దృష్టి కి తీసుకు వెళితే, ఆయనకు చికాకు అన్నారుట.


న్యాయ స్థానం ఊరుకోలేదు, మన దేశం ఎంత గొప్ప దేశం అని పేరు, కాని ఇలాంటి దేశం లో ఆకలి అరుపులు,ఆకలి చావులూ నా సిగ్గుచేటు, వెంటనే ఈ కుళ్ళి పోతున్న ధాన్యాన్ని, గోధుమలను బీదలకు, ఆకలి తో అలమటించే వాళ్లకు పంచి పెట్టండి, ఇది మా ఆర్డర్ ,వెంటనే అమలు పరచండి అన్నారు ట.


మంత్రి గారు ఇంకా ఆ ఆట వ్యవహారాల్లో తల మునకలై ఉన్నారు పాపం. ఏవో కొట్లలో వ్యవహారాలు,పెద్ద ,పెద్ద తలలు ,  తలలు పట్టుకుని కూర్చున్నారు లెక్కలు , వాటాలు తేలక. మధ్యలో, ఈ బీద వాళ్ళు, ఆకలి, తిండి గింజలు,ఊరికే పంచి పెట్టడం, ఏమిటి ఇదేమైనా సత్రమా ? ఆషామాషీ వ్యవహారమా? నాకు అంతా తీరిక ఏమి లేదు,నా చేతులు ఖాళి లేవు, పక్కింటికి వెళ్ళు అని ఉచిత సలహా ఇచ్చే గృహినిలాగా   .. . 


న్యాయ స్థానం ఊరికినే పంచమని సలహా ఇచ్చింది, సలహాలు విని ఊరుకోవాలి కాని ,పాటించ క్కర్లేదు కదా అని కూడా అన్నారుట.


ఈసారి న్యాయస్థానం కి నిజం గా చాల కోపం వచ్చింది ట. ఏమిటి ఈ మంత్రి వ్యవహారం , అత్యున్నత న్యాయస్థానం చెప్పిన మాట ని కరివేపాకు లా తీసి పడేస్తారా? ఇలా ఊరుకోం మేం. మేము చెప్పింది సలహా కాదు, ఇది ఒక నిర్ణయం. మీరు పాటించండి ,చాలు, ఇంక మాటలు వద్దు అని గర్జించింది.


మంత్రి   ఇంక చాలు ఈ వ్యవహారం చాల దూరం వెళ్ళింది అని వెళ్ళి ప్రధాన మంత్రి గారిని కలసి, నేను మంత్రి  ని కదా,నాకు స్వతంత్రం లేదా?అని  గోల పెట్టేసరికి, ఆయన కూడా ఏదో ఒకటి మాట్లాడ వలసిన సమయం వచ్చింది మరి,ఇంత వరకు తీసుకువచ్చేరు. 


ప్రభుత్వం ఎలా నడపాలో మాకూ తెలుసు, మాకు ఎవరూ చెప్పకర లేదు, ప్రభుత్వం నడప డానికి ముఖ్యం గా కావాల్సింది..ప్రజలు, కాదు, కాదు, ధనం. ఉచితం గా తిండి గింజలు పంచి పెడితే,రైతుల కి నష్టం కదా, రైతుల దగ్గర కొని, దాచలేక వృధా అవుతున్న గింజలు సంగతే న్యాయస్థానం  చెప్పింది కదా అని మన లాంటి వాళ్లకి ఒక సందేహం వస్తుంది, తప్పు లేదు, కాని, చాల పెద్ద,పెద్ద వ్యవహారాలు పట్టించు కునే, మంత్రులకి, ఇలాంటి చిన్న చిన్న సందేహాలు రావు.


మళ్లీ కథ మొదటికి వచ్చింది.


చాప చాప ఎందుకు ఎండలేదు అంటే??? కథ లా ఉంది కదా?


వార్త పత్రికలూ చదవ లేని, ఆకలి తో కాళ్ళు ముడుచుకుని పడుకునే సామాన్యుడు, అతి బీద వాళ్ళు, అంటే ఒక గీత కింద ముడుచుకుని పడు కునే వాళ్ళు..(ఇంగ్లీష్ లో బెలౌ ది పోవేర్తి లైన్), ఇవేమీ తెలియని వాళ్ళు,ఈ పూట ఎలా గడుస్తుందా?అని  దిక్కులుచూస్తూ ఉంటారు.


నవ్వి పోదురు గాక నాకేమి సిగ్గు.


ఒక డబ్బా బియ్యం కుక్కేర్లో    పడేసి, వంకాయో, అరటి కాయో  వండి పడేసి, ఓ పచ్చడి తో ఇవాల్టికి, అదే ఈ రాత్రి కి సరిపెట్టుకుందాం.. పదండి..మరి..



14 సెప్టెం, 2010

మన పయనం ముందుకే.


ఏలూరు లో రామకృష్ణా పురం లో ఉన్న రోజులు. చుట్టూ అరుగులు, మధ్యలో ఓ పెంకుటిల్లు, ఆరుగురు పిల్లలు, ఇంటి నిండా ఎప్పుడూ స్నేహితులు, చుట్టాలు, వచ్చి పోయేవాళ్ళు, వీళ్ళు చాలక , వీధి చివర పాపాయి రచన ని తెచ్చి ముద్దు చేసే అమ్మా -నాన్న గారలు, ఇంటి కి తలుపులే లేవు,ఎప్పుడూ తెరిచే ఉండేది ఆ ఇల్లు,  ఇంట్లో మనుషులం కూడా అలాగే  ..తలుపులు తాళాలు వేసుకుని దాచుకునేందుకు అంతా విలువైనవి ఏమి లేవు కదా అని నిశ్చింత.. 

ఇప్పుడు మనుషుల్లో ఎంత మార్పు. ఇంట్లోకి రాగానే, అదేదో ద్రిష్టి యంత్రాని చూడమని ఒకరు, చిన్న పిల్లలకి జ్వరం వస్తే, ఎవరో ద్రిష్టి పెట్టారని, భయపడే వాళ్ళు, వ్యాపారం లో నష్తం వస్తే, ఏదో శని గ్రహం అని రేకులు తెచ్చి కట్టడం, ఇవి నిజం గా నమ్ముతున్నారా ప్రజలు? లేక పోతే టీవీ చానెల్స్ లో ఇన్ని రకాలు  ద్రిష్టి యంత్రాలు, శని తాయత్తులు జనం ఎలా నమ్ముతున్నారు? మనం ముందుకు నడుస్తున్నామా? లేక వెనక్కి పరుగులు పెడుతున్నామా?


ఒక పక్క చంద్రుడు మీద కాలు పెడతాం ,రాకెట్లు పంపిస్తాం అంటున్న  శాస్తజ్ఞులు, మరో పక్క అనారోగ్యం అంటే తాయత్తులు అంటూ, వ్యాపారం లో నష్టాలు వస్తే ద్రిష్టి తగిలిందని యంత్రాలు కట్టుకుంటూ, మూఢ నమ్మకాలతో జనం కాలం నడుపుతూంటే ప్రభుత్వం ఏం చేస్తోందో అర్ధం అవటం లేదు.


పూర్వం ఈ మూఢ నమ్మకాలు కి నిరక్షరాస్యత్ తో సంబంధం ఉందని నమ్మే వాళ్ళం. చదువు కున్న వారే నేడు ఈ యంత్రాలు, తంత్రాలు ని నమ్ముతున్నారంటే, చదువు ,ఈరోజుల్లో ఎంత వికాసాన్ని ఇస్తోందో అర్ధం అవుతున్నది. టీవీ చానల్స్ లో భారిగా ప్రకటనలు, రాష్ట్రాన్ని బట్టి వివిధ భాషల్లో ప్రకటనలు, వాటినే శాస్త్రీయం గా చూపడానికి మోస పూరిత ప్రకటనలు,ఎంత వ్యాపార దృష్టి తో చేస్తున్నారో, ఎంత లాభాలు అర్జిస్తున్నారో, ఎంత పక్క గా వ్యవస్థి కృతం చేస్తున్నారో ఈమోసాన్ని, ప్రజలకు  వివరించ వలసిన బాధ్యత లేదా ఈ ప్రభుత్వం కి.


చేతబడులు చేస్తున్నారు అంటూ అమాయక స్త్రీలని కొట్టడం, కొట్టి చంపడం, చిల్లన్గులని, మందు పెట్టారని, మాయలు చేస్తున్నారని, నమ్మడం, నమ్మించడం, టీవీ లో కూడా వీటిని కథలు కథలు గా ప్రచారం చేయడం, అన్నీ చూస్తూ,కూడా, ఎవరూ ఖండించక పోవడం, ఇవన్నిచూస్తూ ఉంటే మనం ఇరవై ఒకటో శతాబ్దం లోకి నిజం గా అడుగుపెట్టామా అని అనుమానం వస్తున్నది.


చదువు మానసిక వికాసం, ఆలోచన, అవగాహన, శాస్త్రీయత లను  పెంచి, నవ్య సమాజం లో నవ నాగరికులను తయారు చేయాలి, కాని, నేడు, వ్యాపార ధోరణి లో సాగే ఈ చదువులు ఒక వస్తువు ను తయారు చేస్తున్నాయి. ఈ వస్తువు వ్యాపార ధోరణి తో అలోచించి, జనం మూర్ఖత్వాన్ని పెట్టుబడి గా ఈ యంత్రాలు తయారుచేసి, కొల్ల గొడుతున్నారు. ఒళ్ళు జలదరించేలా  ఉన్నాయి ,ఈ ప్రకటనలు.


ఎవరో   ఒకరు మన ఇంటికి రావడం, ఒక  చెడు దృష్టి తో చూడడం, ఏదో నష్తం కలగడం, ఈ యంత్రం కడితే అన్నీ పోవడం, ఎలా సంభవం..జీవితం లో ఒడిదుడుకులు ఉంటాయి. ధైర్యం గా ముందుకు సాగడానికి, ఆలోచన, సమయమం అవసరం.అంతే కాని, ఎవరో వీటికి బాధ్యులు అని, అప నమ్మకం తో, ఏవో యంత్రం మరేదో తంత్రం ని నమ్మడం.. అంటే మన జేబులో చిల్లు, వారి చేతిలో ఘల్లు ఘల్లు ..ఇప్పటికైనా జనం మేలుకుని ఈ టీవీ ప్రకటనలని నమ్మడం మాని, వారి వ్యాపారం ని మూత పరిస్తే , జనం కి మేలు. ప్రభుత్వం అంటే ఎవరో కాదు ప్రజలే, ప్రజలు మేలుకుంటే, ప్రభుత్వాలు కూడా ఉలికి  పడతాయి, ప్రజలకు అనుకూలం గా పని చేస్తాయి.


మనసు తలుపులు ఎప్పుడూ తెరిచి ఉండండి, మూఢ నమ్మకాలని వదలండి..మీ ఆరోగ్యం, మీ రక్షణ, మీ చేతిలోనే ఉన్నాయి. పత్రికలూ, మీడియా కూడా ఈ విషయాలను బల పరిచి,ప్రజలకు నిజమైన మేలు చేస్తాయి అని ఆశ పడుతూ..


విజ్ఞానం అనే ఒక చిన్న దీపం వెలిగించండి, అజ్ఞ్ఞానం ని తొలగించండి అని వేడుకుంటూ ,


చదువు, సంస్కారం, విజ్ఞానం అనే వెలుగు లోకి మన నడక అని మళ్లీ మళ్లీ పిలుపు నిస్తూ,


ఎందఱో మహానుభావులు మనకి దిశా నిర్దేశంచారు,  మరి వెనక్కి ఇంక చూడకండి,


మన పయనం మరి ముందుకే.. ముందుకే.. ముందుకే.....