"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

30 ఏప్రి, 2013

అక్షరం

అక్షరమే అని ఊరుకోకు 
అక్షరమా అని పరిహసించకు 
అక్షరంతో చేస్తావా యుద్ధం ?
అని వెట కారం చేయకు . 

అక్షరం శాంతి, అక్షరం క్రాంతి 
అక్షరం పేలని బులెట్ 
అక్షరం నిబిడీకృత మిసైల్ 
అక్షరం పదునైన కత్తి . 

అక్షరం అజ్ఞానానికి అంతం 
చెప్పే అవకాశానికి నాంది 
అక్షరం వెలిగించే దీపం లో 
నలు దెసలా కాంతే కాంతి . 

అక్షరం అందరి హక్కు 
కాదు అది వ్యాపార సొత్తు. 
అక్షరం కాదు కబంధ 
హస్తాల సొంత సొత్తు. 

అక్షరం తెచ్చే జ్ఞానం 
తేవాలి విజ్ఞానం , అంతే కాని 
గోడ మీద తగిలించే ఉత్త 
కాగితం ఫోటో కాదు ,అక్షరం . 

కూడు ,గుడ్డ నీడ , ఈ మూడింటికి 
జత కూర్చండి నాలుగో పరమార్ధం . 
అక్షరం అనే అమృతాన్నిఅందరికి 
సమంగా పంచేద్దాం ,రండి రండి .

అసమానత , అన్యాయం ,
అధర్మం ,అనాగరికత అన్నిటి పై 
ఎక్కుపెట్టిన అస్త్రం అక్షరమ్. 
సంస్కారం తెచ్చి పెట్టె అక్షరమే ,అక్షరమ్. 

అక్షరం కి సలాం చేద్దాం ,
అక్షరాని కి నమస్తే అందాం 
అక్షరమా స్వాగతం అందాం 
అక్షరమే అండ దండ అందాం 
అక్షరానికి  నేను గులామ్. 
అక్షరానికి నేను ఆరాధన చేస్తా 
అక్షరం తో వారధులు వేస్తా 
అక్షరం తో నలుదెసల యానం చేస్తా 
అక్షరం తో కథలే చెబుతా 
అక్షరం తో పాటలే పాడుతా 
అక్షరం తో కదం తొక్కుతా 
అక్షరం తో పధం సాగుతా 
అక్షరమే నా పధం 
అక్షరమే నా గమ్యం 
అక్షరమే నా ధ్యేయం ,అక్షరమే మన ధ్యేయం . 



28 ఏప్రి, 2013

సుఖం ..దుఖం ..

మరపు అదృష్టమో 
కాదో ,వద్దు వద్దు అనుకున్నవి 
పదే పదే గుర్తు  చేస్తుంది . 
ఎంతటి గొప్ప అనుభూతి అయినా 
రేపటికి మసక బారుతుంది . 

వాడిన మల్లెపూలు ఎత్తి 
కిటికీ బయట విసిరేసినట్టు 
అనుభూతి విభూతి లా జలజల 
రాలిపడిపోతుంది మాపటికి .


పురాతన దుఖాలు మటుకు 
రేగి ,రేగి, పుండులా 
ఎప్పుడూ సలుపుతూ ఉంటాయి ,
దుఖం కి జీవిత కాలం అంత ఎక్కువేమిటో ? 

దుఖం వెనువెంటే నీడ లా 
సుఖం పక్క పక్క నే హితుడి లా 
సూర్య చంద్రులు లాగ ఒకరి మొహం ఒకరు చూడరు . 
నాకేమో రెండు కలిసిన  క్షితిజ రేఖ దగ్గర 
ఉండిపోవాలని చిరకాల కోరిక ,ఫలించేనా ? 

సుఖం అంటే ఏమిటో ఎలా తెలిసేను 
నీకు దుఖపు క్షణాలతో పోలికతో కదా 
సమ స్థితి అంటూ లేదు అంతా 
సాపేక్షం అమ్మా అంటూ నా కొడుకు చేసేడు ఉపదేశం . 

తరచి చూస్తే అదే కదా సత్యమ్  
అదే కదా సత్యం శివం సుందరం .  






26 ఏప్రి, 2013

నా పుస్తకాలు సర్దుకున్న ఈ రోజు నా మనసులో మాటలు

చలం  గారి ని నా పక్కనా 
అంటు అంటూ తొలిగాయి కొన్ని 
అయినా నేను మొండిగా 
నా హృదయం లోంచి పెకిలించి 
అక్కడ ఆ బీరువాలో అంటు వేసాను ,

ఏదో ఆశ ,ఆ సంస్కారం పిసరంత 
ఆ మిగిలిన కథకులకి అంటుకుంటుంది అని. 
రావి శాస్త్రి మన వాళ్ళేనా ? అంటూ 
చోటిచ్చాడు , కోకు ఏమంత 'చదువు ' కున్నావు ?
అంటూ కసిరాడు , సంఘం ని చదివావా ?
ఎప్పుడైనా ? అంటూ ఇంటర్వ్యూ చేసారు . 

దేవులపల్లి వచ్చావా చెలం ? ఎన్నాళ్ళయింది 
నిన్ను చూసి, మనం భావ కులం కవులం ట ,
అంటూ చిన్నగా వెక్కిరంతగా నవ్వేరు ,
చలం ఒక్క క్షణం ఆలోచించి , 'రమణాచలం '
అంటూ నిండుగా కొండై  'పొయారు' . 

కథ కి పీఠం వేసి కోర్చోబెట్టాలి 
ఎవరర్రా అంటూ నేను , నేనెవరు మధ్య లో ?
ఏమి లేదు నా బీరువా లో మరి ఇంతే జాగా 
నా తల లోకైతే ఎన్నయినా ఎక్కిస్తాను ,ఇక్కడ 
మరి అందరూ తోసుకుని తోసుకుని ఎక్కాల్సిందే బస్సు. 

వందేళ్ళ కథ, రెండు దశాబ్దాల కథలు, రావి శాస్త్రి కథలు 
బీనా దేవి' అతిసర్వత్ర  వర్జేయత్'  అంటూ హెచ్చరిస్తూనే ఉంది నన్ను 
అయినా కథ అంటే ఇంత పిచ్చి ఏమిటి ? నాకు 
కథ కంచికి తీసుకెళ్ళే వరకు తోడు గా ఉంటాను రమ్మీ అంటూ 
చిన్న పిల్లల ని సాకుతున్నట్టు ,చంక నెక్కించుకుంటాను . 

కొన్ని ఇంక చంకే దిగవు. విస్మృత యాత్రికుడు ని ఎప్పుడు 
అనగా మొదలు పెట్టాను, ఎన్ని యాత్రలు చేసాను ? 
హంపి నించి హరప్పా దాకా, కొన్నేళ్ళు గా నంచుకుంటూ 
ఎప్పటికి పూర్తవదు ,ఆ సారస్వత విందు . 

చివరకు మిగిలేది ? ఏమిటి ? అంటూ దయానిధి గడ్డి పరక తో 
అన్న మాటలు , హిమ జ్వాల లో ఎలా కనిపెట్టేను నేను ? 
ఒక చిన్న ,పెద్ద వ్యాసమో , ఏదో రాయవా ? అని ఎవరు అడిగారు
నా సొంత వాయిస్ ఓవర్ , కాని అలా వినిపించే శబ్దాలని నొక్కి నొక్కి 
చంపేయటం లో నేను మాస్టారీ కదా. మీకు తెలియదా ? 

అరకు లోయలో కూలిన శిఖరం, పొగ లేనిదే నిప్పు రాదు ,
నా గురించి కథ రాయవూ అంటూ కుముదం, 
అమృతం తాగిన మధుర స్త్రీ మూర్తి అమృత , 
యాస గా మాట్లాడే కోమలి, దయానిధి కనిపించని అమ్మ కోసం 
ఎన్ని రాత్రులు ఎదురు చూసానో పిచ్చిగా ,అవి నవల లో పాత్రలే అంటే 
నా మనసు అంగీకరించలేదు . అయినా ఆ కథ ల పేర్లే ఎంత కవిత్వమో ? 
బుచ్చిబాబు నా గురువా ? మొహమా ? గురుత్వా కర్శణా ? అంటే నేను 
పడిపోకుండా నిలబెట్టిన రచయితలు కదా, యవ్వన ఆకర్షణ లో నే 
'పడి ' పోకుండా నాకు అస్తిత్వం, బాలన్స్ , ఉనికి ఇచ్చి పుణ్యం కట్టుకున్న 
గొప్ప వారు ,వారే కదా.. 

పదండి ముందుకు ,పోదాం, పదండి తోసుకు పై పై కి అంటే 
ఎలా పరుగులు పెట్టేం ? శ్రీ శ్రీ ని కూడా మాతో సాయానికి రమ్మన్నామ్.. 
ఏమిటో ? చేతిలోంచి ఓఫ్ ఓఫ్ మంటూ పొగ పీలుస్తూ ఇదిగో వస్తాను అంటూ 
మరో ప్రపంచం లోకి మాయం అయిపొయారు. 

శ్రీ శ్రీ  మహా ప్రస్తానం ,పక్క, అమృతం కురిసిన రాత్రి, ఆ పక్కనే నండూరి 
ఎంకి పాటలు, ఇంకా రావోయి బంగారి మామా అంటూ బసవరాజు అప్పారావు ని, ఇంకా ముద్దుకృష్ణ వైతాళికులు , అన్ని కలగలిపి షో అంటూ 
పరిచేయనా పేక ముక్కలా పొందిగ్గా .. 

నువ్వు శాంతా ? నువ్వు శాస్త్రి వా అంటూ ? అడుగడుగు బేరీజు వేసుకుంటూ 
నా జీవిత సాగరం లో లైట్ హౌస్ అతడు -ఆమె పుస్తకాలు , 
ఉప్పల లక్ష్మణ రావు మాకు అత్యంత ఆప్తుడు అని ఇదిగో మా ఇంట్లో ఒక 
మెంబరు అని అందరికి పరిచయం చేసిన గుర్తులు ఇంకా చెరిగి పోలేదు . 

కొడవటిగంటి కుటుంబరావు ఇంత అరటి పండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పినా ఇంకా ఈ సంఘం దాని గతి తార్కికం నీకు వశం కాలేదా ? 
మనసు కోతి మరి, నీ చెప్పు చేతల్లో ఉంచుకో ,చేయి దారితే అంతా దగా దగా 
విజ్ఞానం ,నూరిపోసాడు, చెవి కేక్కితేనా ? తర్కం కి అందని ఈ ప్రేమ వశం ఎందుకయానో ? 

స్వీట్ హొమ్ రంగానాయకమ్మే నాకు ముద్దు, నా బుచ్చిబాబు నాకు ముద్దు. 
జానకి విముక్తి చెందింది కాని, నా తలకి ఏదో కొంచం భారం గా , ఏవో కళ్ళద్దాలు అడ్డం వస్తున్నాయి, కాస్త తీసి పక్కన పెట్టని .. అన్నిటిని చీల్చి చెండాడే ఆ వయసు ఉద్రిక్తత జారి , నిండు నది ఆ గంభీరం గా ఇప్పుడు పయనం మరి ఇది. 

ఇంకా ఎన్నో పేర్చాలి, కాస్త చోటివ్వండి ,అంటూ బతిమాలుకుంటున్నాను , 
అబ్బ ,వినరే . 
పెద్దిభొట్ల, శ్రీపాద, మధురాంతకం ,ఖదీర్ బాబు, కులాలు మతాలూ లేవు అన్ని కలిపేసేయ్ , ఇక్కడైనా సరే, సరే, 
నవీన్ ,గోపీచంద్ చైతన్య స్రవంతి పథం లో , ఎలా కొట్టుకుపోయాం, మనసు ,మేధా ఎలా చెప్పినా సరే, రాసెసెయ్ అంటూ పేజీలు  పేజీలు  నింపేయడం .. ఏదో పేరు పెట్టి ,అదో లైఫ్ .. 

ఇంకా నెవిల్ షూట్ , గ్రాహం గ్రీం హెమింగ్వే , మాం , పెర్రీ మసన్ ,షేర్లోక్ హొమెస్ , గ్రిషాం , చేతన్ భగత్,  దప్నే దు మరిఎర్ , ఫ్రెంచ్ కథకురాలు, ఇర్వింగ్ వాల్స్ లావు లావు పుస్తకాలు, సన్నని పుస్తకాలు మాకేక్కడా ? మా చోటు ఎక్కడ? అంటూ నన్ను నిల దీస్తున్నాయి. 

అన్నిటిని ఊరుకో పెడుతూ, అచ్చం అమ్మ లాగే , అందరికి స్థానం చూపిస్తాను అంటూ ప్రామిస్ చేస్తూ ... ఉండనా మరి ఇవాల్టికి . 








తుది ప్రయాణం...

ఒక మనిషి బ్రతకడానికి 
ఇన్ని వస్తువులు కావాలా ?
మనసులో సౌందర్యం కి 
బయట కనిపించే రంగులెన్ని ?

చిన్న ఆశ చాలు కదా ,గుప్పెడంత 
ఇంత పెద్ద గృహం కావాలా ?
మనిషి శాంతి గా బ్రతకడానికి .. 
ఆత్మ కి ఎంత చోటు కావాలో ? 

సర్వ అవయవాలు చాలు కదా 
ఆస్తి గా ? నయనాలే కోట్ల ఆస్తి , 
నలుగురికి ప్రదర్సన ,ఏదో ఒక 
ఎక్షిబిషన్ లాగ ? నిన్ను నువ్వే 
ప్రదర్శించు కోవడం ,ఒక నిత్య కృత్యం . 

కావలసినంత అంటే ఎంతో 
ఎవరైనా చెపుతారా ? మనం 
దూర ప్రయాణం కి ఎంత మోసుకు
వెళతామో , లెస్ లగేజ్ ,మోర్ కొమఫోర్ట్ 
అంటూనే ఉన్నారు. 

ఇవాల్టికి ,రేపటికి ,ఎల్లుండికి 
ఇంకా మరో తరానికి ఒక అంతు లేదు 
అలా ఎదిగి పోవడమే , చెట్టు చూడు 
తను మోసెంత వరకే ఎదుగుతుంది . 

చెట్టు లా ఎదిగేం కాని ,చెట్టుకి ఉన్నంత 
జ్ఞానం కూడా లేదు, అయినా ఈ రోజు 
ఈ పురిటి వైరాగ్యం ,నాకు తెలుసు 
ఈ నాటి తో సరి. 

రేపటి కోసం అప్పుడే కలలు ,
అప్పుడే వస్తువులు ,ఈ అనంత 
ప్రయాణం లో నన్ను కప్పెట్టే అన్ని 
వస్తువులు, ఎప్పుడో భారం అనిపించి 

ఆ తుది ప్రయాణం లో ,అన్ని ఒక్కొక్కటి 
జార్చేస్తాను, నా బరువు ఒక్కటి నాకు చాలు 
అనిపించే ఆ తుది ప్రయాణం కి 
మరికొన్ని మెట్లు తయారు చేస్తాను ఇదిగో ,
వస్తున్నా.. వస్తున్నా.. 





24 ఏప్రి, 2013

బొంత ...

అతుకుల బొంత ఒకటి తయారు చేస్తున్నాను 
నా చిన్నప్పటి ఒక రెండు జడల సన్న కాళ్ళ పిల్ల 
మల్లెపూలు కూడా నీకు బరువా ? పిల్లా అంటూ చేతి లోంచి 
నేలకి ఒరిగిన మల్లెపూలు ని దుమ్ము దులిపి, చెక్కుకు పోయిన 
నా మోకాలి చిప్పపై ఒఫ్ అంటూ ఊదిన తాతగారు ఒక 
మాసిపోతున్న తెలుపు నలుపు చిత్తరువు జ్ఞాపకం , 
ఇది ఒక మొదలు.. 

ఇంకా సూది దారం, తో గుచ్చి గుచ్చి, మెల్లగా బొంత కుట్టు 
మొదలుపెట్టాను, ఒక్కో కుట్టు కి ఒక జ్ఞాపకం వచ్చి ఒద్దికగా 
కూర్చుం టున్నాయి , బొంత ని అందం గా చేయాలని నా తాపత్రయమ్. 

పుస్తకాలు బరువుగా మేని ని ఒంచి, 
చదువు జీర్ణం చేసుకున్న పసితనం అది 
మరో ధ్యాస లేదు, మరో చనువు లేదు ,నాతో నేనే పరిచయం పెంచుకుంటూ 
మెల్లగా స్నేహం రుచి చూసి, ఆ మొహం లో పడి పోయాను గా 
ఆ జ్ఞాపకం ని మెత్తగా బొంత కుట్టు తో కుట్టేసా ..  

ఇంకా కొన్ని వైవిధ్యమైన ,రంగుల ,చిత్రాలు 
తళుక్కున మెరిస్తూ, నా అతుకుల బొంత లో జాగా కోసం పోటి పడు తున్నాయి. 
ఒక్కొక్కటి , నాణ్యం చూసి, అతకనా వద్దా అని ఆలోచించి 
కొన్ని బద్ధకించి కుట్టడం మానేసాను . 

స్నేహాల అతుకులు  మటుకు ఎటువంటి మొహమాటం లేకుండా నన్ను కుట్టేయ్ అంటూ 
నా బొంత లో చోటు సంపాదించుకున్నాయి. 
అబ్బా ఎంత వెచ్చ గా ఉందొ నా అతుకుల బొంత వాటేసుకుంటే .. 
స్నేహం నా చుట్టూ చేతులు వేసినట్టు .. 

ఏదో వయసులో చిట్టి చిట్టి ఆకర్షణలు ,మాయం అయి ,ఒక తీవ్రమయిన 
కాంక్ష,  ఇలాగే అతని తో జీవించాలని అదే ప్రేమ అన్నారు, 
ఆ తీయని జ్ఞాపకాల తోరణాలు చిక్కగా అల్లిబిల్లిగా నా బొంత లో మెరుపుల్లా .. చిట్టి చిట్టి చేతుల ,మెత్తని స్పర్శ ని మరో అందమయిన బట్ట గా కుట్టేసా 
నా అతుకుల బొంత లో, 

ఏమిటో ,ఒక రంగు ఒక బొమ్మ లేదు, అన్ని రకాల వస్త్రాలతో ,
వైవిధ్యం గా, ప్రకృతి గీసే బొమ్మ లాగా తయారయింది ,ఆఖరికి ,
కుట్లు కుట్లు గా ,అతికిన బొంత ,లో కుట్టేసాను నా గుర్తులు ,నా జ్ఞాపకాలు ,
ఇప్పుడు ఇక నా ఖాళీ జీవితం అంతా మడిచి పెట్టి, పారేయొచ్చు ,
లేదా ,గంధం అక్షితలు చల్లి పరిమళం గా దాచుకొవచ్చు. 

నా జీవితం అంతా ఇలా అల్లి ,ఇలా కుట్టి, ఇలా విడమర్చి పరిచేసా 
నా జీవితం అతుకుల బొంత లా లేదే ,ఆశ్చర్యం అంతా ఒకే ఆకాశం లా 
చుక్కలు, మబ్బులు, చందమామ ని మోసే ఆకాశం అయిపోయిందే , 
నా చుట్టూ ,నన్ను తాకుతూ ఇంక ఎప్పటికి నా బొంతే ఇది. నా సొంతం . 






నా నడక , నా బాట ..

నేను నడిచిన బాట 
మరీ అంత అంతు చిక్కని బాట 
ఏమి కాదు.. 
అయినా ఎప్పుడూ వెలుతురు లో 
చీకటి ఉన్నట్టు ఎప్పుడూ 
వెతుక్కోవడమే .. 
తడుముకోవడమే 
ఎందుకో ,ఎంత వెలుగు సరిపోదు 
చీకటి శుభ్రం గా నయం అనిపిస్తుంది 
వెలుతురు కి చెయ్యి అడ్డుపెట్టి 
చీకటి కోసం తడుము కోవడం లో 
ఏదో ఒక ఆనందం.. 
అలవాటు లో ఎంత సుఖమో ,
నన్నడుగు నేను చెపుతా 
అలవాటు లో ఉన్న శాంతి 
నువ్వు కొత్త దారి వెతుక్కోడం లో 
ఉండదు, ఎంత కష్టమైనా ,నష్టమైన 
నాది అయిన ఈ స్వర్గం నుంచి నేను 
కదలను మెదలను .. 

చీకటి లో ఒక సుఖం ,
నా మొహం లో రంగులు 
మరి కనిపించవు ,
తెల్లని చిరాకు, ఎర్రని క్రోధం 
నీలం శరీర రంగు అన్ని 
నల్లటి చీకట్లో ఒకటే 
అందుకే నల్లటి చీకటి 
నేను హత్తుకుంటాను ఇష్టం గా. 

కష్టమయినా అందుకే అలవాటు 
అయిన బాట లో నడకే నాకు ముద్దు 
మరో దారి చెబితే వద్దు.. 
జిగురు కన్నా గొప్పగా 
అంటుకుంటుంది ఈ అలవాటు జిగురు . 

నా నడక నా బాట .. 
నిర్విఘ్నం గా ఇన్నేళ్ళు సాగుతోంది ?
వెలుగు కోసం అంటే ,
నువ్వు ఎలా నవ్వుతావో నాకు తెలుసు 
చీకటి ని హత్తుకునే నువ్వు, 
చీకటి ని ఇష్టం గా హత్తుకునే నువ్వు.. 









23 ఏప్రి, 2013

పెను నిద్దుర ...

అర్ధరాత్రి నిద్దురలో మెలకువ 
వచ్చి కల ని సరి జేసుకున్నాను 
నా కల నేనే రచిస్తాను ,రోజూ 
మెలకువ లో తీరని కోరికల 
పట్టి ఒకటి తయారు చేసి, 
తల కింద పెట్టుకుని , కలత గా 
నిదుర పోతాను, కల ఒకటి 
వస్తుంది, నా కోరిక తీరిన కల 
ఇంతలో మెలకువ కూడా , 
ఇలా నా జీవితం మొత్తం 
నిదుర లోనే గడిచి పోతుంది . 

జీవించడం అలసట 
అనిపించి ,అప్పుడప్పుడు ఇలా 
కలత నిదురో, కలో తెలియని 
అయోమయం లోకి వెళ్లి 
అలసట తీర్చుకుంటాను . 

ఎందుకో ధైర్యం గా 
పులి నైనా ఎదుర్కుంటాను కాని ,
ఈ జీవిత వ్యాఘ్రం నన్ను తినేస్తూ 
నా ఎముకుల బోలు ని 
రాల్చేస్తూ కాల్చేస్తుంది నిలువునా .. 


ఇంక ఎప్పుడయినా ఆలోచిద్దాం 
ఎలా జీవించాలో ?
ముందు నన్ను ఆత్మరక్షణ 
చేసుకోనివ్వండి , 
నా వెనకకి పరుగుని ఆపకండి ,
దయచేసి .. 
నా పెను నిద్దుర లోకి 
నా ప్రయాణం ఆపకండి మరి .. 

20 ఏప్రి, 2013

నా నీలి ఆకాశం ..

అలసట గా అనిపించి 
అలవోకగా వెనక్కి వాలితే 
ఆకాశం పలకరించింది ,
నేను మర్చిపోయిన ఆకాశం . 

చిన్నప్పుడెప్పుడో ,
ఒక కల విత్తనం నాటాను ఈ 
నీలి ఆకాశం లోనే, ఇంక మొదలు 
ఏడు రంగుల హరివిల్లు కోసం 
ఎదురుచూపులు . 

ఆ మధ్యే ,ఎందుకో విసుగు 
చికాకు, నిప్పులు చిమ్మే ఎండలు 
అతివృష్టి తప్ప ,నెమ్మది గా 
కలలు ఆరబోసుకునే మునుపటి 
ఆకాశం ఏది? నా నీలి ఆకాశం .. 

నా మబ్బులు తుడిచిన పలక 
లాంటి నీలి ,నీలి ఆకాశం ,ఏ 
దొంగలు కాజేసారో ? కలలే రాని 
కమ్మటి నిద్ర , ఎవరు కాజేసారో ?

మళ్లీ , మళ్లీ ఎప్పుడో ఆ కల 
విత్తనం నాటే శుభ ఘడియ , 
అని అంతటా వెతుకుతూ ఉండగా 
ఏవో మనసు  గొళ్లేలు విడి విడిన 
సందడి , చీకటి మూలల వెలుగు 
కడిగేస్తూ, చిరు చిరు దివ్వెలు 
కన్నుల వెలిగిస్తూ, కన్నుల ముందే 
నీలి ఆకాశం ,హరివిల్లు కల ని 
సాకారం చేసుకుంటూ , కమ్మటి 
నిద్దురని కంటి నిండుగా కాచి పోసింది . 

అవును, నా ఆకాశం లో నా 
నిద్దుర ,నా కల తిరిగి దొరికాయి ,
ఒక్కసారి లోపలి చూసుకున్న 
ఆ నీలి రంగు వికాసం అంటుకుంటే
మరి పోదు , నీలి రంగు వికాసం కి 
పూస్తాయి ఏడు రంగుల హరివిల్లులు. 
నా నిద్దుర , నా కల ,నా ఆకాశం . 
మరెప్పుడూ నావే , ఎప్పుడూ ఇంకా నావే .. 


19 ఏప్రి, 2013

కథలు రాసే వాడి మొహం ...

కథలు రాసే వాడి మొహం 
అంటూ ఏమయినా ఉంటుందా? 
ఏమో ,కథలు రాసే వాడు ఎలా 
ఉంటాడు? అని ఆలోచనలో పడ్డాను . 

పొద్దున్నే నిద్ర లేచి అరచేయి లో 
లక్ష్మి ని చూసుకుని, కాఫీ అయిందా అంటూ 
ఒక్క అరుపు, బాత్రూం లో దూరిపోతూ 
అరిచి.. ఇంత లేట్ అయిందా ? నన్ను 
నిద్ర ఎందుకు లేపలేదు? అని ఒక 
సత్కారమ్ శాలువా భార్యకి కప్పి ,
ఒక్క కిక్ తో స్కూటర్ కి ప్రాణం పోసి 
గర్వం గా ,నా కథ కి ఈ మారు అయినా 
వెయ్యిన్నూట పదహార్లు ఇస్తారా ? 
ఆ ఎడిటర్ కి నా తడాఖా తెలియదు ,
నేను తలచుకుంటే, అంటూ ఊహల్లో 
ఎప్పుడు జేరుతాడో ఆఫీసు. 

అందరూ నంగిరి మొహాలే , కథల్రాసే 
ఫలానా ఆయన అని ఒక్కరూ 
పరిచయం చేయరు, అంతా నేనే 
చెప్పుకోవాలి, ప్రవర ఖర్మ.. 
ఫలానా కథల పొటి లో నాకు 
మూడో బహుమతి , ఏదో 
మతలబు జరిగే ఉంటుంది ,లేక పోతే 
అంత గొప్ప మానవీయ కథకి 
మూడో బహుమతా ? మరి తీసికట్టు గా 
ఈ మారయినా ప్రధమ బహుమతి కొట్టేసి 
శ్రీమతి కి ఒక బంగారు గాజుల జత . ఊహు, 
గాజులు రావు, బంగారం ధర కొండెక్కి 
కూర్చుంది, ఒక ముక్కు పుడక 
చ, అన్యాయం గా ఇంత చీపు ఊహలేం ?

ప్రభుత్వ ఆఫీసు లో జరిగే అన్ని 
లంచాల కార్యక్రమాలు ,చూసి చూసి, 
దళసరి అయిన చర్మం తో ఒడుపుగా 
సొరుగు నింపి, చిల్లర మహా లక్ష్మి 
ఎందుకు కాదనాలి? అంటూ ఒక చేత్తో 
ఆ చల్లని లచ్చిం దేవి కి ఒక నమస్కారం కొట్టి, 
కాస్త తీరుబడి గా వెనక్కి వాలి, రేపు 
మంచి  రోజు, శ్రీ అంటూ రాసుకుని, కథ 
రాసేయడం మొదలు పెట్టాలి, అల్లా 
మొదటి బహుమతి వచ్చిన ఫలానా 
రచయిత కన్నా ,గొప్ప ఎలిమెంట్ ఉండాలి 
నా కథ చదివి, కన్నీరు తో తడి అయిపోవాలి 
పాకులు, అవును మార్చే పోయాను 
ఆ రొమాంటిక్ కథల పోటి సంగతి, 
ఎక్కడా ,నా శ్రీమతి శ్రీలక్ష్మి తో రొమాన్స్ 
హు .. ఎవడితో చెప్పుకోను ?అలసి పోయాను 
అంటుంది, ఇంకేం ఉంది, నా కథలకి 
ఎక్కడ నించి వస్తుంది మరి? లవ్వు  ??


సాయంత్రం తీరుబడి గా వీధి వీధి 
తిరుగుతూ, కథల కోసం ఆబగా 
షుగర్ పేషంట్ మిఠాయి కొట్ల వేపు 
చూసినట్టు, ఈ చెప్పులు కుట్టే వాడు 
నాకు తెలిసి ఎన్నేల్లుగా ఇదే పని ,
వాడి కష్టాలు , కుటుంబం వివరాలు 
అడగనా పోనీ ? వద్దులే, ఇప్పటికే
చాల కథలే వచ్చాయి, మరో
మంచి కథా వస్తువు వెదకాలి, అలా 
ఒక్క సారి ,కనక మహా లక్ష్మి వారి 
మందు దుకాణం ముందు ఆపనా ?
ఇంట్లోకి తెస్తే కాళ్ళు విరగ్గోడుతుంది 
కాని, ఇక్కడే ఒక అర గ్లాసు పుచ్చుకుంటే 
కథ రాసే మూడ్ వస్తుందేమో ?

వీధి వీధి తిరిగినా ఎక్కడా ఒక్క కథ 
స్టొరీ పుట్టలేదు, ఏమిటి ,మన దేశం లో 
కొంప దీసి దారిద్ర్యం, మధ్య తరగతి 
మిథ్య విలువల కష్టాలు ఇంక లేవా 
ఏమిటి? అమ్మో, గోప్పోళ్ళ కథ ల లో 
స్టొరీ ఏముంటుంది? నాలాంటి రచయిత 
ఇంక మట్టి గొట్టుకుపొతాడు .. చా చా 
కథలే కరువయిన దేశం రా ఇది ,గొడ్డు 
పోయింది, స్కూటర్ స్టాండ్ వేసే లోపల 
భార్య శ్రీలక్ష్మి ,ఏమండి ,మన ఇంట్లో పని 
చేసే సత్తి ని మొగుడు చావ గొట్టాడుట ,
పాపం, పని లోకి రాలేనని కబురు పంపింది 
లుంగీ లో కి మారి ఏది ఒకసారి చెప్పు మళ్లీ ,
హమ్మయ్య కథలు రాసే మొహం ఇలా ఉంటుందా ?

ఏమో మరి.. 






11 ఏప్రి, 2013

ప్రకృతి కి వికృతి ..

తీయగా పాడు 
అంటూ కోయిలని 
శాసించలేవు.. 

చల్లగా వీచు 
అంటూ గాలిని 
ఆజ్ఞాపించలేవు 

ఆగిపో ,చలించడం 
ఆగిపో అంటూ 
నది నీరు ని 
కోరలేవు .. 

ఒక్కసారి మాయం 
అయిపో కాంతి ని 
తీసుకు పో  అంటూ 
వెన్నెల కి 
మసిబూయలేవు 

అలలు ను  ఆపు 
ఒక్కసారి అంటూ 
సాగరానికి 
అడ్డు కట్టు వేయలేవు . 

ప్రతి రోజు 
ఉదయించే సూర్యుడి ని 
ఏమయినా ఆపగలవా?
ఈ ఒక్క రోజు ఆగిపో 
అనేది అసంభవ క్రియ . 


ఈ ప్రకృతి సమస్తం 
తమ  శాశనం 
తాము రాసుకున్నాయి 
సమ తూకం లో 
తామే ఒక నిదర్సనం . 

ఎందుకో 
మనిషే ఒక అసమాపక క్రియ 
ఒక అసంపూర్ణ కథ 
ప్రకృతి కి వికృతి .. 
ఏనాడు ప్రకృతి కి
పర్యాయ పదం మనిషి 
అవుతాడో ఆ రోజే 
యుగాది .. 












10 ఏప్రి, 2013

మరో దారి లేదు. ...

అలల పై కవిత్వం రాయాలని 
నది ఒడ్డున కూర్చున్నా 
ప్రతి పదం నది లో నాని పోయింది 
ఇంకా ఏముంది ?
పొడిగా , దండిగా ఇంకా నీ 
మాటల పొట్లం లో వేడి గా 
ఏదయినా విప్పు, పరచు 
అంటూ నన్ను నిప్పులా రగిలిచింది . 

పూల మొగ్గల ముందు 
జాలిగా వాలాను, నాలుగు పదాల 
పుప్పొడి జోలి లో పడేయమని, 
నీరు పోసావా ? నారు పోసావా ?
అంటూ కళ్ళల్లో నీళ్ళు 
తెప్పించి, వెళ్లి నీ మాటల విత్తులు 
జల్లు ,ఎప్పుడో ఒకనాడు 
పదాల పంట పండొచ్చు ముచ్చటగా .. 
అంటూ తరిమి కొట్టింది , 
మట్టి వాసన చూసి రా పో అంటూ .. 

ఆకాశం వేపు ఆశగా చూసాను ,పైకి 
ఎర్రని ఎండ కి కళ్ళ కి చేయి అడ్డం పెట్టి 
ఒక్క మేఘం అయినా అటు వెళుతూ 
నాలుగు చుక్కల పదాల వర్షం 
నా పరచిన చీర కొంగు ని తడిపేస్తూ 
వర్షిస్తాడు అని, వడి వడి గా మేఘం మరో 
దేశాన్ని ముంచేయడానికి వెళుతూ 
చేయి ఖాళి లేదు, నువ్వొక కురిసే 
మబ్బువు కాలేవా , కాసింత కరుణ కురిపిస్తూ 
అంటూ అంత ఎండిన గుండెలేం ,మీవి 
తడి తడి గా ఉండడం నేర్చుకోండి అంటూ 
విసిరి కొట్టింది ,సుడి గాలితో కొట్టి . 

నా నేలా , నా భూమి ,నా ఆకాశం 
గుప్పెడయినా ఇంక సొంతం 
చేసుకోవాలి మరి.. 
ఇంక మరో దారి లేదు. . 
మరో దారి లేదు. 



'నేను'

'నేను' అనే నా ఉనికి ని 
నిలబెట్టే నా ఆంతర్యం 
నా వర్గ లక్షణం ,
నా చదువు ఇచ్చే గర్వం 
నా పుట్టుక ఇచ్చిన 
కుటుంబ నేపధ్యం ,
నేను నేర్చుకున్న 
నా అలవాట్లు , నా చుట్టూ 
నేను ఏర్పరుచుకున్న 
రక్షణ వలయం .. 
నించి విడి వడి .. 
' నేను ' ఏమిటో ??

ఉల్లిపాయ పొరల లాగ 
ఒక్కొక్కటి వలుస్తూ వెళితే 
ఏమి మిగుల్తుందో నాకు తెలుసు 
అతి చిన్న నేను అనే పదార్ధం 
చుట్టూ పేర్చిన పల్చని 
పొరలు , కాసిని కన్నీళ్ళు 
కాపలా తో, అవును నేను 
ఎన్ని వలయాల మధ్య 
కప్పబడి ఉన్నానో ? నాకు 
తెలుసు.. 

నేను అంటే 'నేను' గా ఎప్పుడు 
ఉన్నాను కనుక ?
శిశువుగా నోట్లో వేలు చప్పరిస్తూ 
అనంత మైన హాయి ని 
అనుభవించి నప్పుడే.. 
జ్ఞానం మడతలు మడతలు గా 
నా ఒంటి మీద పడి , నేను సిగ్గు 
అభినయించడం నేర్చుకున్న రోజు 
'నేను ' కోల్పోయిన రోజు అనుకుంటా .. 

'నేను' కోసం వెతుక్కుంటూ మరో 
ప్రయాణం ఎప్పుడూ వెనక అడుగే 
తెలిసిందంతా ముందు
వదిలించుకోవడం ఒక ప్రయాస 
( to get rid of the knowing 
and going back to unknowing )
అజ్ఞానం ని ఎందుకో ఈ రోజు 
ఆహ్వానిస్తున్నాను .. 
'నేను '..ఆవిష్కరించడం కోసం ... 


















9 ఏప్రి, 2013

ఈ క్షణం ..

అవును ఎంత నిజం 
ఈ క్షణం ,ఈ జీవిస్తున్న క్షణం 
ఒక్కటే నిజం .. 
నిన్న గడిచి పోయిన కాలం ,
పిడికిలి లోంచి జారిపోయిన ఇసుక 
ఇసుక ని పిండి తైలం తీయవచ్చేమో 
కాని నిన్న మటుకు రాలేదు . 

నిన్న ఒక పాఠం.. 
నిన్న ఒక చరిత్ర ,
నిన్న ఒక వగచాటు ,
నిన్న తీరి పోయిన కల . 
నిన్న కోలుకోలేని వ్యధ 
నిన్న ఎప్పటికి నిన్న గా 
నిన్ను పరమార్సిస్తుంది 
నేర్చుకున్నావా ? ఏమయినా 
నా నుంచి ? అని నిలదీస్తుంది . 
ఒక్కోసారి నిన్న ని చెరిపేయాలని 
ఒకటే ఆరాటం, నిన్న ని తుడిపేయాలని 
కసి , అసహనం తో పిడికిలి బిగించి 
నా జీవిత పుస్తకం లో ఈ నిన్న 
పుట లేకపోతే బాగుండును , అని 
ఆఖరికి కన్నీళ్ళు తో వేడుకున్నా 
కాలం ఎంత నిర్దయి.. 
నిన్నని నేను ఏమి చేయలేని తల్లి 
అని అసహాయం గా నిట్టూర్చి 
ఇదిగో ,కావాలంటే ,అంతగా 
ప్రాధేయ పడుతున్నావు కదా 
ఇదిగో నీకు కాన్క .. 

ఈ క్షణం .నీకు నా కానుక 
ఈ క్షణం నీది, ఎవరు కాదనలేరు 
ఈ సత్యాన్ని. ఈ క్షణం లో 
నువ్వు జీవించు, నీ కలల ని 
సాకారం చేసుకో , ఈ క్షణం పోనీ 
రేపటి కల కను, రేపటి కల కోసం 
ఈ క్షణం తపించు, కార్య సిద్ధి కై 
నడుం బిగించు ,ఈ క్షణం నీది 
ఇది ఎవ్వరు కాదనలేని సత్యం . 

కాలం నిర్దయి అని శపించకు ,
ఇదిగో నీ క్రోదానికి భయపడి కాదు సుమీ 
నీ మీద ప్రేమతో ..నీకు ఈ క్షణం ఇచ్చా 
నువ్వు , ఏం చేసుకుంటావో నీ ఇష్ఠం .. 
కాలం దయామయి , 
కాల చక్రం పాదాల కింద నలిగి పోయే 
ప్రతి క్షణం కి ఒక వరం .. కూడా ఉంది 
అదే మరపు , మరచి పొవడం , 
మరపు వరం పొందిన క్షణం మనకి 
అది వదిలి పెట్టి ,సాగిపోతుంది 
అనంత కాల చక్రం లో , ఈ క్షణం 
ఒక్కటే సత్యం .. సుందరం ..శివం . 



కొలను ..

కొలను .. 
అక్కడెక్కడో ,ఒక ఊరి మధ్యలోనో 
ఊరి చివరో కాదు.. 
కొలను అనగానే 
వికసించిన కమలాలు, 
బద్దకించి ముకుళించని  మొగ్గలు 
నిదానం గా చెరువులో తలలు ఒంచి 
నీరు తాగే పశువులు , 
బిందెలు నీటిలో ముంచి
ఊరి వార్తల ఊట విప్పి , 
ఊరించుకునే పల్లె స్త్రీలు ,
గోచి బిగించి, తల దించి 
బుడుమ్గమని మునిగే పల్లె 
పిలకాయలు, మడి తడి 
అంటూ అసింటా నీళ్ళు పట్టుకునే 
ఆ ఊరి పూజారి, ఆ కొలను వే ,
కాసింత అసింటా అయితే చాలు 
దేవుడి కి సరిపొతాయి.. 

ఆ కొలను గురించి కాదు .. 
ఊహు ఆ కొలను చిత్రం కాదు 
నేను మనసులో గీసిన బొమ్మ 
నా మనసు అనే కొలను.. 
అవును ఆ కొలను గురించే 
నేను చెప్పేది ,రాసేది . 
ఒక్క ఆలోచన ,మనసు కొలను 
లో ఎలా తమాషాగా రింగులు 
రింగులు తిరిగి, వృతాలు గీస్తుందో 
మనసు కొలను లో .. 
ఒక్క ఊహ ఎలా మనసు కొలను కి 
గిలిగింతలు పెట్టి, చిన్న చిన్న 
కెరటాలు ని పుట్టిస్తుందో ,కొలను 
ఉపరితలం మీద.. 

ఒక్క జ్ఞాపకం ఎలా మునిగి 
తేలుతుందో ,కొలను లోకి 
గిర గిర తిప్పి వేసిన గులక రాయి లాగ 
తేలుతుందో, మునుగుతుందో ఏమో 
ఆ రాయి ,బరువు, నునుపు ,గుండ్రం 
అన్ని కలగలిపి చెప్పే సత్యం .. 
నా మనసు కొలను లో ప్రతి 
జ్ఞాపకం కి ఒక చిరునామా ఉంది .. 
ప్రతి ఆలోచన కి ఒక వృత్త పరిధి ఉంది . 
ఊహల గిలిగింతలకి ఒక 
పరదా , సరదా , అలల తీరు ఉంది 

మనసు కొలను లోతు మటుకు 
వేల సంద్రాల లోతు కి ధీటు .. 
ఆ లోతు కొలతలు మటుకు నన్ను 
అడిగి ,నన్ను పిచ్చివాడిని చేయకండి 
ఆ కొలను లోతు మటుకు ,నన్ను 
ఎప్పటికి ,కొలత తీయమని .. 
అడగకండి ..ఎందుకంటే 
అది ఒక అసామాన్య కొలత . 
కొలను మనసు లోతుపాతులు 
అంతు చిక్కని అగాధాలు . 


కొలను .. 
అక్కడెక్కడో ,ఒక ఊరి మధ్యలోనో 
ఊరి చివరో కాదు.. 


8 ఏప్రి, 2013

ఒక కల

కలత నిదుర లో ఒక కల 
రేపు లెక్కల పరీక్ష అని 
మొత్తం ఒకటి నుంచి  చివరి పేజి 
వరకు లెక్కలన్నీ బట్టి పట్టి 
పరీక్ష అట్ట  కి క్లిప్ 
హాల్ టికెట్ ,పెన్ లో ఇంకు 
అన్ని సరి చూసుకుని ,వెళ్లి 
పరీక్ష హాల్ లో కూర్చున్నాక 
తెలిసింది ... ఆ రోజు సైన్స్ 
పరీక్ష అని. అబ్బ ఎంత 
దుర్దినమ్.. 
ఎంత చెడ్డ కల?? 
హా కలా .ఎంత హాయి 
ఉత్తి కలే కదా .. 

తర్వాత జీవితం లో 
ఎదుర్కున్న పరీక్షల ముందు 
ఆ రోజు పీడ కల ఎంత 
మధురమొ.. ఆ పీడ కల 
తరవాత వచ్చిన మెలకువ హాయి 
ఎప్పటికి మర్చిపొను. 
ఈ జీవితం కల  లో ఎప్పుడు అలా 
మెలకువ వస్తుందో ? 

అని తలచుకుంటూ రోజు 
నిద్ర పొతాను.. ఆ పీడ కల ,
ఆ మెలకువ కోసం రొజూ 
ప్రార్ధిస్తూ నిద్రపొతాను. నేను . 

7 ఏప్రి, 2013

ఒక నాడు సముద్రం ఒడ్డున ...

ఒక నాడు సముద్రం ఒడ్డున   

చిన్న చిన్న పిల్లలం 

ఇసకలో కట్టేం చిన్న చిన్న గుప్పెళ్ళతో 
పెద్ద పెద్ద గోపురాలు ,పైన ఒక చిన్న 
పువ్వు పెట్టి , మురిసి పోయామ్. 
ఒక గుడి కట్టేశాం అని .. 
ప్రతి గుడి కి ఒక మూల దేవుడు 
ఉండాలని తెలియని బాల్యం మరి. 

పసితనపు అమాయకత్వపు 
గుడి , మరు రోజు కి 
సముద్రం మింగేసింది ,ముచ్చట పడి.  
ఇప్పుడు ఎన్నో ,పెద్ద పెద్ద గుడులు 
చూసాం ,దణ్ణాలు పెట్టుకున్నాం 
మరి ఎవరు ఎత్తుకు పోయారో కాని 
ఏ దేవుడు లోను నా పసితనం 
ప్రతిష్టించిన దేవుడి లేని గుడి లోని 
పవిత్రత కనిపించదు. 

ఎందుకో ? 



6 ఏప్రి, 2013

ఇది జీవితం ,ఇది దారి ...

ఇది జీవితం ,ఇది దారి 
అని కొలుచుకుంటూ ,అడుగులో అడుగు 
దారి అగమ్యం . 

గుచ్చుకునే ముళ్ళ చెట్లు 
గీరి గీరి పలకరిస్తాయి . 
కాసిని పూల చెట్లు వేయోచ్చుగా 
ఎవరో ? అని సణుగుతాను .. 

నువ్వే వేయోచ్చుగావెవ్వె 
అంటూ వెక్కిరించాయి. 
మూతి ముడిచి ,నొసలు చిట్లించి 
తల దించి , నాకోసం దారి నేనే 
వేసుకోవాలా ? ఏమిటి ???

అవును ,మరో దారి లేదు .. 
నీకు ఎవరి మాట నచ్చదు కదా 
నీ దారి నీది ,నీ గొయ్యి నీది 
నీ పువ్వుల చెట్లు నీవి 
నీ ముళ్ళు నువ్వే ఏరి పడేయాలి 
మరో దారి లేదు నీకు. 

ఒంటెత్తు పోకడలు గొప్ప 
ఒంటరి దారి  నవ్యత 
ఒంటరి జీవనం ధైర్యం 
ఒంటరి బతుకు నాది అంటూ 
చెప్పిన కబుర్లు ఏమయాయి ?? 

నలుగురి దారి, నలుగురు నడిచిన దారి 
ఎంత సాఫిగా ఉంటుందో ? తెంపరి పిల్లవి 
కాళ్ళు విరిగినా సరే ,నా దారి నేనే 
అంటూ గెంతేవు .. 

ముళ్ళు నరికి పూల చెట్లు నాటి 
ఇప్పుడు నువ్వు నీ దారి అంటూ 
మొదలు పెడితే ,నీ గమ్యం ఎప్పుడు చేరేవు ?
గమ్యం చేరడం ముఖ్యమా ? 
అందరి తో నడవడం ముఖ్యమా ?? 

అని ప్రశ్న లతో ఇంకా 
ఆలస్యం చేయకు .. 
ఒక్క అడుగు వేయి 
ఒక్క అడుగు ముందుకు వేయి 
ఒక్క అడుగు ముందుకే మరి..  



4 ఏప్రి, 2013

థాంక్ యు స్పీచ్....

నాలో నేను చూసుకోవడం 
నాలో నన్ను వెతుక్కోవడం 
నాలో నేను ఉన్నానా ?
అని టార్చ్ లైట్ తో 
వెతుక్కోవడం ఎందుకు ?
అసలు చీకట్లో లేను కదా 
అసలు చీకటే లేదు కదా 
అంతా వెలుగు లోనే 
ఈ భ్రమ, ఈ భ్రాంతి 
నేను ఉన్నానని .. 
నమ్మించు కోవడం 
అలవాటు అయిన ఒక 
అబద్దం . అసలు నిజం 
ఏమిటో తెలియదు లే 
ఇదే , ఈ అబద్ధమే నిజం 
అనుకుంటే పోలా .. 

అవమానం ,అనుమానం 
అభిజాత్యం పై వలువలు 
అనురాగం ,అభిమానం 
తీసి పారేసిన విలువలు 
మొహం ,ప్రేమ సినిమాలో 
డైలాగ్ రైటర్ రాసే పంచ్ డైలాగ్స్ .. 
కరుణ , దయ కారిపోయిన 
మేకప్ రంగులు . 
అంతా ఒక నటనాలయం .. 
ఈ ప్రపంచం అంతా ఒక 
నాటక రంగం ,అని ఊరికే అనలేదు .. 

అందుకే నేను జీవించను 
చక్కగా అలా గే నటిస్తాను 
రంగులు కడిగి పారేసి ,
రాత్రి మటుకు హాయిగా చీకట్లో 
నన్ను నేను అద్దం లో చూసుకుని 
మురిసి పోతాను ,పెద్దగా ఏమి 
మార్పు రాలేదే నాలో ? 
వయసు ముడతలు అవి 
పికచర్ ఆఫ్ డోరియన్ గ్రే 
లాగ ,అద్దం లోనే ఉండి పోతాయి .. 

నాలో రగిలే కుళ్ళు ,అసూయ 
నాలో పొంగి పోయే నామీద ప్రేమ 
అన్ని అవసరమయిన అలంకారాలు 
ఈ ముఖం ,ఎప్పుడు అందం గా 
మెరిసి పోడానికి నేను వాడే 
కాస్మెటిక్స్ , ఎంత ఖరీదో 
నా ఆత్మ కి తెలుసు, అయినా 
వెనకాడను కొంటునే ఉంటాను.. 
అందం గా కనిపించడం ముఖ్యం 
అందం గా ఉండడం కాదు లోపల .. 
లోలోపల 

ఆస్కార్ , లాంటివి ఇచ్చేస్తారేమో 
ఒక ఫైన్ మార్నింగ్ , నేను అసలు 
అలాంటివి స్వీకరించను నాది నటన 
కాదు, జీవించటం అంటాను నేను . 
అయినా ఏదో సరదాగా ,
ఒక థాంక్ యు స్పీచ్ తయారు 
చేస్తూ ఉంటాను ..
ఎంత బాగా నటిస్తానో నాతో నాకే పోటి 
అందుకే ఆస్కార్ నాకే రావచ్చు.. 
ఈ నటన లో జీవించడమో .. 
లేక జీవితం లో నటించడమో .. 
ఏమో ,ఏదో ఒకటి .. 







3 ఏప్రి, 2013

ఆఖరి చెట్టు ...

కలో మెలకువో తెలియదు 
మెలకువ లోనే కలో 
లేక కల లో మెలకువో 
ఒక అందమయిన 
కల, నా చుట్టూ పచ్చని 
అడవులు , పచ్చ పచ్చనివి.. 

ఆకాశం నీలం ఎత్తైన కిటికీలు 
వెలుతురు కిరణం సన్నని సూదులు 
దారి అంతా మెత్తని పండిన ఆకులు 
పువ్వులు విచ్చలవిడి గా విరబూసి
పిచ్చి దాని  తలలో తురుముకున్నట్టు 
అదే పిచ్చి చెట్లు ..

నా దారి అగమ్యం, అన్ని పచ్చగా 
అన్ని దారులు ఒక్క లాగే 
దిక్కు తోచదు , పచ్చని చీకట్లో 
బలమయిన తీగలు ,ఊడలు 
చుట్టూ ముట్టేస్తూ , అవి 
ఊతమా ? ఉరి తాళ్ళా ? 

నాకు నిండా తెల్లని వెలుతురు 
కావాలి ,తల ఎత్తితే నీలాటి నీలం 
కప్పు కావాలి, నాకు  రంగులు 
కావాలి అంటే ప్లాస్టిక్ పువ్వులున్నాయి. 

ఆకు పచ్చ ,బలిసిన చెట్లు వేళ్ళు తో 
సహా ,పెకిలించి దారి వేసుకున్నాను 
నున్నటి ,నల్లటి ,కంకర రాయి .. 
ఎర్రటి మట్టి మరి లేవకుండా ,తొక్కి తొక్కి 

హమ్మయ్య ఇంక నేను నా నాలుగు 
చక్రాల వాహనం లో గుండెల నిండా 
మంట ని పీలుస్తూ , ఇక నిశ్చింత గా 
ఎన్ని వేల మైళ్లు అయినా అలా జారి 
పొవచ్చు.. ఇది కల , నిజమా ? 

ఏమో ,ఈ లోపల చెట్టు బలం గా 
ఉరి వేసుకుంది ,ఆఖరి చెట్టు మరి 
ఒంటరితనం భరించలేక , నాకు 
మెలకువ వచ్చింది ,ఈ సారి ,నాకు 
తెలుసు ,అది కల అని .. 
నేను కదా మరి ఉరి వేసుకున్నది
ఆఖరి చెట్టు బలసిన ఊడ ల తో .. 
నేనే కదా ఉరి ...... 





2 ఏప్రి, 2013

ప్రపంచ ఆటిస్టిక్ దినం , ఏప్రిల్ రెండు తేది ..

ప్రపంచ ఆటిస్టిక్ దినం , ఏప్రిల్ రెండు తేది 

ఎందుకు వీరి కోసం ఒక స్పెషల్ దినం అని ఆలోచిస్తున్నారా? 

ఉంది .ఒకటి ..కాదు చాలా కారణాలు. 

పిల్లలు ,పసి పిల్లలు దేవుడు తో సమానం అంటారు , 

కాని, ఆ పిల్లలే ,ఎప్పటికి పసి పిల్లల గా ఉండి పోతే ,

వారికి ఏవో పేర్లు పెట్టి సంఘం వారిని ,చిన్న చూపు చూస్తూ వారికి అందరితో 

సమానం గా బ్రతికే అవకాశాలు మృగ్యం చేస్తుంది . 

సమజానికి ఒక మేలు కొలుపు , ఒక విన్నపం , ఒక స్నేహ హస్తం .. ఈ 

స్పెషల్ పిల్లల నించి అంటే మేం స్పెషల్ కాదు ,మేమూ అందరి లాగే , మాకు 

ఒక అవకాసం ఇవ్వండి అని. ఈ ప్రపంచ ఆటిస్టిక్ దినం.. 

 అయితే ఈ ఆటిస్టిక్ పిల్లలు అంటే ఎవరు?? 
అందరి లాగే ,చక్కని పిల్లలు. అయితే వీరి ఎదుగుదల లో కొన్ని తేడాలు లేదా ,కొన్ని ప్రత్యెక గుణాలు కనిపిస్తాయి. 
తల్లి తండ్రులు కి ఈ గుణాలు మొదట్లో అర్ధం కావు ఎందుకు ,మా పిల్లలు అందరి లా లేరు అని కుమిలి పోతారు , విసిగి పోతారు, అందరిలా గబ గబా మాటలు నేర్చు కోరు , లేదా నేర్చు కున్న కొన్ని మాట లానే మళ్లీ మళ్లీ అంటూ ఉంటారు . 

పిల్లల ఎదుగుదల లో కనిపించ వలసిన చిహ్నాలు కొన్ని నెమ్మదిగా లేదా కొన్ని అసలు కనిపించక పొవచ్చు. 
తల్లి తండ్రులు ముందుగా ఈ విషయం లో కొంత జ్ఞానం కలిగి ఉండాలి . 

అందరి పిల్లల్లా నా పిల్ల లేక పిల్లాడు ఎందుకు లేరు ? అన్నప్రశ్నలు బాధిస్తాయి.  సమాజం లేదా చుట్టూ పక్కల పిల్లలు వీరిని ఎలా చూస్తారు ? వీరిని అందరూ ఎలా ఆమోదిస్తారు? అని భయాలు కలుగుతాయి. ఇవి సహజం , అయితే ఇలా ఆలోచిస్తూ పిల్లలని కూడా బాధ పెట్టడం మాని ,తల్లి తండ్రులు , ఇంట్లో పెద్దలు ఇలాంటి పిల్లలకి మనమేం చేయాలి అని ఆలోచించడం ముఖ్యమ్. 

ఎంత త్వరగా ,గమనించి ,గుర్తించి ఈ పిల్లలకి తగిన వైద్యం అందించడం ముఖ్యమ్. 

ఎలా గమనించాలి ? ఎలా గుర్తు పెట్టాలి ? మన పిల్ల ఆటిస్టిక్ అని. ఇవి కొన్ని సూచనలు లేదా సంకేతాలు . మీ పిల్లల్లో గమనించండి . 

1. పిల్లలు మాట్లాడడానికి ఇష్ట పడక పోవచ్చు . 
దానికి కారణం మన మాటలు అంటే తల్లి తండ్రులు చెప్పే మాటలు వారికి అర్ధం కాక పొవచ్చు. 
వారి భాషా జ్ఞానం, లేదా మాట్లాడగలగడం , చాల నెమ్మదిగా జరుగుతుంది , అంటే అందరి పిల్ల ల్లాగా ఒకట్రెండు ఏళ్లకే మాట్లడక పొవచ్చు . 

2. వారి మాటలు కూడా తమాషాగా మళ్లీ మళ్లీ ఒకటే మాట అంటూ, ఒక్కోసారి ,తమాషా గొంతు లో పాట లాగా ,అవే మాటలు అంటూ ఉంటారు . 
ఒక మాట ,లేదా ఒక వాక్యం ని అదే పని గా అలా పలుకుతూ ఉంటారు అంటే సందర్భం లేక పోయినా అవే మాటలు అంటూ ఉంటారు . 

3 వారికి ఏం కావాలో ,వారు చెప్ప లేక పోవడం , భాష జ్ఞానం ,మాటలు రావక పోవడం వల్ల ,ఈ స్థితి . 

4 పేరు పెట్టి ,పిలిచినా ,పలకక పోవడం, మామూలుగా చిన్న పిల్లలు ,ఒక ఏడాది ,ఇంకా ముందు నుంచే వారి పేరు పెట్టి పిలుస్తే , గుర్తిస్తారు , ఒక ప్రతి స్పందన ఉంటుంది . కాని, ఈ పిల్లల లో ఈ ప్రతి స్పందన ఉండదు . 

5 ఒక ఏడాది పిల్లాడు చేసే ధ్వనులు , మాటల అనుకరణ లు ఉండవు ,ఈ పిల్లల లో . 

6 16 నెలలు అంటే ఏ న్నర్ధం పిల్లాడు చేసే ఒక్క పదం మాటలు, అమ్మా అత్తా ,లాంటివి కూడా పలకరు. చాల మౌనం గా ఉంటారు . 

7 రెండేళ్ళు కి పలికే కొన్ని చిన్న చిన్న పదాలు కూడా అనలేకపోవడం . 

8. నెమ్మదిగా నేర్చుకున్న కొన్ని మాటలు కూడా మర్చిపోవడం . 

ఇవి మాటలు, భాష కి సంబంధించిన కొన్ని సంకేతాలు. ఇవి గమనించడం ముఖ్యం ,తల్లి తండ్రులు . 

మరి కొన్ని సంకేతాలు. 

1. ఈ పిల్లలు ,చేతులు రాసుకుంటూ లేదా ఊగుతూ , లేదా చప్పట్లు కొడుతూ ఇలా కొన్ని చేష్టలు మళ్లీ మళ్లీ ,అదే పనిగా చేస్తూ ఉంటారు . 
2. పెద్దలు చేసే పనులేవీ ,చూసి వీరు చేయరు .. అంటే పెద్దలని  అనుసరిస్తూ ,పిల్లలు చేసే పనులు చేయరు. ప్రయత్నం కూడా చేయరు . అంటే మామూలుగా పిల్లలు పెద్దలని అనుసరిస్తూ ఆ పనులు ,చేష్టలు నేర్చు కుంటారు , కాని ఈ పిల్లలు అలా నేర్చు కోరు . 
3. వీరికి ,గుండ్రం గా తిరగడం లేదా అలా తిప్పించు కోవడం ఇష్టం . 
4. వీరి చేష్టలు ,కదలికలు కొంత వింత గా తోస్తాయి , అంటే తేడా గా ఉంటాయి 
5. ఈ పిల్లలు ముని వేళ్ళ పై నడవడానికి ఇష్ట పడతారు. 

తల్లి తండ్రుల తో వీరి బాంధవ్యం కూడా చాల నెమ్మది.. ఈ సంకేతాలు గమనించండి .. 

1. కళ్ళ లో కళ్ళు కలిపి చూడ డానికి ఇష్ట పడరు . ఈ పిల్ల వాని తో మనం కళ్ళు కలిపి చూద్దాం అన్నా వీరికి ఇష్టం ఉండదు , కళ్ళ తో జరిగే సంభాషణ ,కి వీరి నుంచి ప్రతి స్పందన  ఉండదు . 

2.  ఎత్తుకోమని చేతులు  అందించడం,  వేలు తో చూపించడం వస్తువులని , చేతులు ఊపుతూ బై ,బై చెప్పడం ,ఆ వయసు పిల్లలు ఇష్టం గా చేసేవి చేయక పొవచ్చు. 

3. తల్లి తండ్రులు లేదా ఒకరి ద్దరు దగ్గర వాళ్ళు తప్ప మిగిలిన వ్యక్తులని గుర్తించరు అసలు. 

4. వేరే ఎవరు వచ్చి ముద్దు చేసినా లేదా ఎత్తు కోవడానికి ప్రయత్నించినా ,ఏడుస్తారు ,లేక గోల గోల పెడతారు . 

5. ఎవరైనా కొత్త వారు ముట్టుకుంటే చిరాకు పడి ,గొడవ చేస్తారు . 

6. ఇతర పిల్లలతో కలవడం వారితో ఆడుకోవడం ,వారిని అసలు పట్టించు కోరు, అంటే పిల్లల కుండే మిగిలిన పిల్లల తో ఆడుకోవాలి అనే సహజమైన ఉత్సుకత వీరిలో కనిపించదు. 

7. అవతల వారి, కోపం ఏడుపు వీరిలో ఏమి స్పందన కలిగించవు ,వీరి మానాన వీరు ఉంటారు, నవ్వుకుంటూ కూడా ఉండొచ్చు అంటే ఎదుట వారి భావాలు  ఏమి పట్టదు ,వీరికి . 

8. మిగిలిన వారితో సంబంధం లేని ,తమ సొంత ప్రపంచంలో వీరు ఉన్నట్టు , తోస్తుంది . 

9. అవతలి వారి వస్తువులు , నిర్మొహమాటం గా తీసేసుకుంటారు, వారి అనుమతి ,అలాంటి వేమి వీరికి పట్టవు . 

10. వీరి గురించి అవతలి వారు ఏం ఆలోచిస్తారు ? ఏమనుకుంటారు అలాంటివి పట్టించుకోరు . 

ఇవి కాక నిత్య జీవితం లో వీరి నడవడిక లో ఇవి గమనించండి . 

1. వారి వయసు కి మించి స్వతంత్రం గా ఉంటారు ఈ పిల్లలు. 

2. కొన్ని సమయాల లో చెవుడు గా ఉన్నట్టు తోస్తుంది, అంటే వినిపించు కోరు , కాని మిగిలిన సమయాల లో శుబ్రం గా వినబడుతుంది , అంటే వినికిడి సమస్య కాదు, వీరికి వేరే ఏదో ధోరణి అని తోస్తుంది . 

3. ఒక పని పూర్తి అయితే గాని మరో పని చేయలేరు అసలు కదలిక ఉండదు, ఒక్క పని ఒక్క సారి అన్నట్టు ఉంటుంది , వీరి ప్రవర్తన. 

4. చేస్తున్న పని లో అంతరాయం కాని, ఆ వాతావరణం లో మార్పు గాని తట్టుకోలేరు , విపరీతం గా చికాకు పడి పోతారు, అలాంటి మార్పులకి 

5.మిగిలిన  పిల్లల అవసరాలు వారి ఉనికి కూడా పట్టించుకోరు , అందు వల్ల తల్లి తండ్రులు , జాగ్రత్త గా ఉండాలి. 

6. ఇలా చేయాలి, అలా చేయి అంటూ తల్లితండ్రులు ఇచ్చే సూచనలు వీరికి అసలు పట్టవు . 

7. ముఖ్యం గా వీరికి ప్రమాదం గురించి ఆలోచన , భయం ఉండవు, స్విమింగ్ పూల్ , రోడ్డు మీద ట్రాఫిక్ లాంటి అపాయాల గురించి వీరికి చింతే ఉండదు , అందుకే తల్లి తండ్రులు ,చాల జాగ్రత్త గా ఉండాలి . 

8. వారికి ఎక్కడ నొప్పో ,ఈ పిల్లలు చూపించ లేరు , నొప్పి ఎక్కడ? అని అడిగితే వీరు సమాధానం చెప్పలెరు. 

9. వీరికి సాయం కావాల్సి ఉన్నప్పుడు వీరు అడగలేరు , నోరు విప్పి అడగరు. 

10. మళ్లీ ,మళ్లీ ,ఒకే పని చేస్తూ ఉంటారు ,విసుగు విరామం లేకుండా .. 

11. వారిని శాంత పరచ డానికి ఏదో ఒక ప్రత్యెక పనో ,లేదా వీరికి ఇష్టమయిన ఏదో ఒక కార్యకలాపం లోకి మల్లించాలి వీరిని.  

12. వీరికి నిద్ర పట్టడమూ కష్టమే , లేదా నిద్ర ఆపుకోవడమూ కష్టమే  . 

13. ఈ పిల్లలకి కొన్ని రకాల తిండి నచ్చదు , చూడగానే వద్దు అంటారు, కొన్ని రకాల ఆహార పదార్దాలే ఇష్టం గా తింటారు . 


ఈ పిల్లల ఆటలు ,ప్రవర్తన. 

1. ఒక్కరు ఆడుకోవడానికి ఇష్ట పడతారు. 

2.  ఆట వస్తువులు ని ఒక క్రమం గా పెట్టడం వీరికి ఇష్టం, ఒక దాని మీద ఒకటి పేర్చే వస్తువుల ఆట ఇష్టం గా చేస్తారు, పదే పదే చేయడం ,వీరి అలవాటు . 

3. ఆట వస్తువులని , వాటి వాటి నిజ ఉపయోగం లో వాడరు, అంటే ఒక రైలు బొమ్మని ,రైలు పట్టాల మీదే నడపాలని ,అలాగే  ,బంతి పట్టుకోవాలి అనే ఆటలు ఆడరు . 

4 . పిల్లలు సహజం గా ఆట బొమ్మలతో చేసే నటన ,వీరు చేయలేరు, అంటే డాక్టరు లా నటించడం , ఒక స్టేత్ బొమ్మ పట్టుకుని అలా చేయలేరు , వీరు. 

5. బొమ్మ లలో ఒక పార్ట్ ,ని అదే పనిగా చూస్తూ ఇష్ట పడతారు , అంటే రైలు బొమ్మలో చక్రాలో లేదా ఒక బొమ్మ లో చేతులు అలాగ .. 

6. ఎంత సమయమైనా ,ఒకే పని చేస్తూ ఉండి పోతారు , టీ వి చూడ్డం , లెగో బొమ్మ ల తో ఆడడం ..ఇలాంటివి .. 

7. ఒక్కో బొమ్మ తోనో లేదా ఒక డ్రెస్ ..టీ షర్టు లాంటి వి ఏదో ఒక వస్తువు తో ఎక్కువ అనుబంధం ( అటాచ్మెంట్ ) కలిగి ఉంటారు . 

8. ఒక్కోసారి, చాల చురుకుగా ఉంటారు, గెంతుతూ , ఊగుతూ, లేదా అడుగులు తొక్కుతూ .. 

9. ఒక టీ వి షో ,లేదా ఒక సంగీతం ఒక పాట ,లేదా ఒక పుస్తకమో ,ఇలాంటి ఏదో ఒక వాటితో ప్రత్యెక అనుబంధం పిచ్చిగా పెంచుకుని ఉంటారు . 

ఇంకా ఈ పిల్లల నడవడిక లో ప్రత్యెకతలు. 

1. మంకుతనం , పట్టుదల ఎక్కువ గా ఉంటుంది, 
2.పాట్టి ట్రైనింగ్ ఇష్టపడరు ,అంటే బాత్రూం లో కి వెళ్ళాలి అని నేర్పితే నేర్చు కోరు, ఇష్ట పడరు. 
3. వెలుతురు , స్పర్శ ..వీటికీ  వీరికి పడదు , కొన్ని వేళ ల లో ,
4. నొప్పి అంటే తెలియదు లేదా పట్టించుకోరు . 
5. ఉండుండి నవ్వుతారు ,బిగ్గరగా , కారణం లేకుండా . 
6. ఉండుంది భయ పడతారు, ఏ కారణం లేకుండా .. 
7. కొన్ని పనులు ,లేదా విద్య లు, మిగిలిన పిల్లల కన్నా వేగం గా నేర్చు కుంటారు . ఉదాహరణ కి చిత్రాలు గీయడం , లేదా రాయడం .. 
8. అద్దం లో చూస్తూ ఏడుస్తారు ,,ఒక్కొసారి. 
9. చుట్టూ ఏం జరుగుతుందో పట్టించు కోరు . 
10. గట్టిగా దుప్పట్లు ,రగ్గులు కప్పేస్తే ఇష్ట పడతారు. 
11. రోజు ఏదో ఒక పద్ధతి కి అలవాటు పడి ,అలాగే జరగాలని ఇష్టపడతారు . 

పిల్లల లో అన్ని ఇలాంటి చిహ్నాలు ఉండక పోవచ్చు, కాని కొన్ని అయినా ,ఉండ వచ్చు. 

పెద్దలు ,తల్లితండ్రులు ,పిల్ల లో ఇలాంటి నడవడిక, కాని గుణాలు కనిపిస్తే ముందు ఒక పిల్లల డాక్టరు ని సంప్రదించి తగిన సలహాలు తీసుకొవాలి. 
వీరు ఏదో పూర్తిగా , మానసిక వ్యాధి గ్రస్తులని అపోహ పడి , పిల్లల జీవితం నరకం చేయకండి . 

ఈ పిల్లలుని జాగ్రత్తగా పరిశీలించి ,వారిని ఓపికగా గమనించి , ఒక నార్మల్ పిల్లాడి ఎదుగుదల కలిగే వరకు వారికి సహాయ తోడ్పాటు అందించాలి . 

మాకే ఎందుకు ఇలాంటి పిల్లలు పుట్టాలి? మేం ఏం తప్పు చేసాం ? పూర్వ జన్మ లో చేసిన పాపమా ? ఇలాంటి ఆలోచనలు మనసుని వేధిస్తాయి తల్లి తండ్రులని , సంఘం ఏమనుకుంటుంది? ఈ పిల్లలు ఎలా జీవితం లో స్థిర పడుతారు ? అన్ని ప్రశ్నలే , కాని అలా ఆగి పోకూడదు . 

ముందుకు ఎలా వెళ్ళాలి ? అని ఆలోచన ప్రారంభించాలి .. 

ఆటిస్టిక్ పిల్లవారు అని ఎంత ముందు గా గమనిస్తే అంత మంచిది. 

తల్లి, తండ్రి ఓపిక గా ఈ పిల్లల పెంపకం లో పాలు పంచు కోవాలి . 

కుటుంబ సహకారం ,కూడా చాల ముఖ్యమ్. పిల్లవాడి మనసు ని బట్టి ప్రవర్తించాలి పెద్దలు కూడా , మంకుతనం, పేచీలు చూసి, ఓపిక నశించే ప్రమాదం ఉంది, పెద్దలు ఓపిక గా వేచి చూస్తూ ,వారి పెంపకం లొ,  ఒక్కో అడుగు తూచి తూచి వేయాలి .  మిగిలిన పిల్ల ల తో పోల్చి చూసుకుని , కంగారు  పడడం , వల్ల ప్రయోజనం లేదు .. ఎందుకు ? అని అలోచించి తగిన సలహా లు పొందాలి . 

నాకే ఎందుకు ? అనే ఆలోచన వదిలి, భగవంతుడు నాకు ఇలా పువ్వు ల్లాంటి పిల్లలని పెంచే అవకాశం నాకే ఇచ్చాడు అని , సంతోషించి , వారిని ఒక బాధ్యత కలిగి మెలిగే పెద్ద వారు గా పెంచడమ ఒక అనితర మైన బాధ్యత. 

మన దేశం లో ,ఇలాంటి  ఆటిస్టిక్ పిల్ల ల కోసం ప్రభుత్వ సదుపాయాలు తక్కువే , మధ్య తరగతి కుటుంబాల లో స్పెషల్ స్కూల్ లో చదివించే అంత స్తోమత అందరికి ఉండక పొవచ్చు. 

తల్లి తండ్రులు , పిల్లలని ప్రేమిస్తూ , వారిని ఆదరణ గా చూస్తూ, వారిలో చిన్న చిన్న మార్పులు తెస్తూ వారిని కొంత వరకు ,ఈ సమాజం లో అందరు తో పాటు కలిసి పోయి బ్రతక దానికి తోడ్పాటు ఇవ్వాలి. 

ఇది ఒక్క ఆ కుటుంబం బాధ్యతే కాదు, సమాజం అంటే మన అందరి బాధ్యత. ఈ సమాజం లో ప్రతి ఒక్కరికి , జీవించే హక్కు ఉంది,  అంటే ఒకరి దయా దాక్ష్న్యాల మీద కాదు.. ఒక హక్కు గా ,ధైర్యం గా బతకాలి. 

ఈ ప్రపంచ ఆటిస్టిక్ దినం నాడు మనం అందరం ఈ విషయం గ్రహించు దాం . 















..