"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

29 జులై, 2013

నాలో నేను ..

ఆకలి ఒక నిజం .
తెల్లని అన్నం మిధ్య 
అనుకుంటూ రెండు గుండ్రని 
ఎండిన గోధుమ చపాతీలు 
వంక దిగులుగా చూసాను . 

ఆరోగ్యం నిజం ,
కమ్మని ,రుచే మిధ్య 
అన్ని చంపుకో ,ఈశ్వరుడు 
కనిపిస్తాడు , అవును పట్టపగలే 
చుక్కలు ,దేవుడు కనిపించారు . 

నీ ఇష్టం వచ్చినవి తిను 
ఆ మెత్తని మెత్త వదిలి రెండు కాళ్ళ 
మీద నిలుచో, ఏది ఒక్కసారి అలా 
నాలుగు అడుగులు వేయి, మరో 
నాలుగు అంటూ నన్ను ప్రేరేపించి
చతికిల పడ్డారు వారే.. 

ఏదో ఒక కారెట్ దొరకక పోతుందా 
ఈ గుర్రాన్ని నడిపించడానికి అని 
జుట్టు పీకేసుకున్నారు అందరూ 
వెతకలేక ,పాపం జుట్టు మొలిపించాలి 
ఇంకా ఇప్పుడు నేనే .. 

నా ఇల్లు, నా మెత్తని సోఫా ,నా స్వర్గం 
ఎందుకు నేను కదలాలి ?
స్వర్గం కోసమే కదా అందరూ తపస్సు 
నాకు ఇక్కడే ,హాయిగా దొరికింది గా 
అసలేం ప్రయత్నం లేకుండా .. 

అయితే సరే, నీ ఖర్మ.. 
అయితే సరే మీ ఖర్మ.. 
నాకైతే ఓకే .. 
మీకేంటి ట?? 
సరే మరి ఉంటా టా టా బై బై
సరదాగా కాసేపు ... 
నాలో నేను .. 


27 జులై, 2013

మనసు

మనసు చెప్పే కబుర్లు 
ఎప్పటికి తరగవు ,
చెవులు మూసుకున్నా ,
పనులు చేస్తున్నా ,ఈ మనసు 
ఉత్త వాగుడుకాయ లాగ ,నిర్విరామం గా 
అలా ఏదో ఒకటి అంటూ వుంటుంది, నువ్వు 
విన్నా ,వినకపోయినా ,సంబంధం లేదు . 

నువ్వు చేసేది ఒకటి ,చెప్పేది ఒకటి 
అంటూ వెక్కిరిస్తుంది , 
నీ పొట్టలో పుట్టిన ఊహ పట్టేసుకుంటుంది ,
ఇహి ఇహి అంటూ నవ్వి, కోపం తెప్పిస్తుంది 
నీ మీద నీకే ,ఇదిగో అలాంటప్పుడే 
అమ్మ మీదో, అత్తమీదో, దుత్త మీదో నా కోపం 
అంతా చూపిస్తా, ఫెడిమని ఒక్కటి ఈడ్చి కొట్టాలని 
పిచ్చి కోపం వస్తుంది, వెధవ మనసు కి రూపం లేదే ,
ఎంత బాధో, ఇది వర్ణించలేను ... 

నా మీద నాకెంత ప్రేమో, ఎంత మోహమో 
వేలెత్తి చూపిస్తుంది, ఆ వేలు విరిచేయాలని వెర్రి ఆవేశం 
ఉత్త చాతకానితనం అంటూ ఎగిరి పడి నవ్వుతుంది ,
మనసు లేని తనం ఎంత హాయో అని చింతిస్తాను ,
నీ చింత నేను తీరుస్తాను, ఒక్కసారి నా ఉనికి మర్చిపో 
అని సవాలు చేస్తుంది, నేను ఉక్కిరిబిక్కిరి అయి 
నా ఓటమి అంగీకరించి , చేతులెత్తేస్తాను . 

మనసు రంగు, రుచి, ప్రదేశం, ఎవరైనా కనిపెట్టారా? 
అసలు, అది లేని ఖాళి ని మటుకు కనిపెట్టగలం ..
సర్వం తెలిసిన వేదాంతు లో ,ఏమి తెలియని పిచ్చి వాళ్ళో 
అయి ఉంటారు, అవును నిజమ్. 
అందుకే మనసుతో చలించడం నాకు నయం . 
మనసు చెలిమి ఆఖరుకి తప్పని నిర్ణయం . 
చెప్పినా ,కొట్టినా వినని మనసు నీకే మరి సొంతం ,
లోపల ఎన్ని యుద్ధలవుతున్నా ,పైకి మటుకు చిరునవ్వు 
ధరించే నీ నటన మొత్తానికి అసమాన్యం అంటూ 
రంగం చుట్టూ చేరి కరతాళ ధ్వనులు ,నాకు మాత్రమే 
వినిపించే మనసు మాయ సవ్వడులు ... 


మనసు చేసే కుప్పిగెంతులు కి ఒక్కొక్క సారి 
పగలబడి నవ్వుతాను, ఎంత హాయి ఆ నవ్వు .. 
మనసు తో తప్పని ఈ ఆట పాటలు కదా 
నా చిన్నతనం , నా బంగారు బాల్యం . 
ఈ స్నేహం ,ఈ వైరం ,ఈ వైరుధ్యం మనసా 
నువ్వో అధ్బుతం.. అవును అధ్బుతం .. 





25 జులై, 2013

నిదురా నన్నావహించాలి ..

నిదుర బెదురు బెదురు గా 
అదురుతున్న అడుగులతో 
అడుగులో అడుగులై ,
అడిగి అడిగి, నిదుర పోవా ??నిదుర రాదా ???ఇంకా 
అంటూ బుజ్జగిస్తే .. 

నేను ఆవలించి, ఆవహించి 
కలల తపస్సు లో కళ్ళు మూసి 
ఇహ లోకం లో కరుదెంచి 
అప్పుడేనా అని కలవరించాలి ,
కల వరించాలి అంటూ నీలి కళ్ళ 
కింద నీలి జాడలు వెతుక్కుంటూ ఎటో 
తప్పిపోవాలి, అవును నిదుర జాడ అడుగు జాడ 
అప్పుడేనా ? అప్పుడేనా ???

ఎన్నెన్ని లోకాలని పలకరించాలి 
చిన్నారి కోరికలని పలవరించాలి 
నేను పెరిగి ఇప్పుడు నా అంత అయినప్పుడు 
ఏమేమి చేయాలని కుతుహుల పడ్డానో, 
ఆ పనులు ఇప్పుడు నేను ఎందుకు చేయనో ?
అంటూ వేదన పొందాలి, వెతలై పొంగాలి .. 

ఇలలో సాధ్యం కానివి కలలో సాధించే 
అసాధారణ అలసత్వం సమీపించాలి 
రేయి అప్పుడే ముగిసేనా ? కనులు తెరిస్తే 
పగలేనా ? పగిలిన కలలేనా ? అంటూ కన్ను మూయాలి ,
కన్నీరు పన్నీరుగా జలకమాడాలి , హాయిగా నిదుర ఒడిలో 
పవ్వలించాలి , కుటీరాలు కలలకై కట్టుకోవాలి ,
ఆ తలుపులు ఇంక మూసి, తాళం పార వేయాలి .. 

ఇంత తతంగం వెనక చెలి చేరినట్టు గా చేరికగా 
కలత నిదుర కమ్మని నిదురైపోవాలి , కమ్మని నిదుర లో 
గమ్మున, మరుజన్మ అంచులై పోవాలి ,ప్రతి ఉదయం పునర్జన్మేగా నీకు .. 
ఎన్నెన్ని జన్మల నిదురో అన్నట్టు ఈ నిదుర నిన్ను ఆవహించాలి .. 
నిదురా నన్నావహించాలి .. 


ఇదేనా మరి నా పరిచయం ??

అలలు ,కలలు పెనవేసి 
అల్లిన వలల ముసుగు నా పై 
తొంగి తొంగి కాసింత వెన్నెల 
చిలకరింత ,పలకరింత నా పై .. 

చిరు చిరు సవ్వడులు ,సుతిమెత్తగా 
చిన్మయ నాదం నింపుతూ నాలో 
మరి ఏవో గాఢ పరిమళాలు 
ఎద నిండా గుబాళింపులు సంపెంగలై... 

ఎద ఏవో తీరాల లంగరు వేసి 
కలవరింతల పలవరింతల ఒడ్డున 
మాటు వేసి, తీయని స్వరాల సరాగాలకై 
తిరిగి తిరిగి వెనుతిరిగి వెతుకుతూ రాగమై మూర్చిల్లుతూ.. 

ఇదేనా స్నేహ రాగం?
ఇదేనా మోహ గీతం?
ఇదేనా మనసు గేయం?
ఇదేనా మరి నా పరిచయం ??