"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

16 మే, 2015

శ్రీ శ్రీ కి పోస్ట్ చేయని ఓ కవిత .

  • శ్రీ శ్రీ కి పోస్ట్ చేయని ఓ కవిత .

    పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ
    ప్రపంచం చివరికీ
    ఆకాశం గీసిన హద్దు వరకూ
    అర్రులు చాచి
    పయనించీ

    ఆ కొసన , ఆ అంచున
    ఓ మారు తొంగి చూసి
    వెను తిరిగి వద్దామని
    ఊహతో , వెనకకి చూస్తే

    పెద్ద గాలి దుమారం
    కళ్ళు గప్పి అంధుడ్ని చేసింది
    నా అడుగులోనే మరో అడుగు
    వేస్తూ అక్కడే గిర్రున తిరుగుతూ

    నే కనుగొన్నాను
    కులం ,మతం నా వెంట
    తోకల్లా ఎంత దూరం అయినా
    వస్తాయని
    తోకలు కత్తిరిస్తే , నే జంతువుని
    కోతి నుండి వచ్చిన మానవుడిని
    అయిపోతానని

    నాగరికత తెచ్చిన ఈ తోకలు మటుకు
    మోయాల్సిందే , రోదసీ నుంచి
    చూసినా అల్పమైన జంతువుల్లా
    ఏవో తోకలు మటుకు కనిపించాయిట

    సందేహం లేదు ,మన ఉనికి ఎంత దూరమైనా
    కనిపిస్తుంది .
    కనిపిస్తుంది మన చరిత్ర
    అంతా కనిపిస్తుంది
    ఎంత భారమైనా ఈ తోకలు
    మటుకు మోయండి , అపెండిసైటిస్ ని
    మోయటం లేదూ , నరుడు ..

    మరో ప్రపంచం నుంచి
    శ్రీ శ్రీ చూస్తున్నావుగా
    మా ఘనమైన మానవ చరిత్ర
    ఖణ ఖణ ల్ , సంకెళ్ళ సవ్వడి
    వినిపిస్తున్నాదా ? మరి
    జయంతులూ వర్ధంతులూ
    సవ్యంగా నే జరుపుతున్నాం

    ఈ ప్రపంచం అంతా శాంతి సౌబాగ్యాలు తో
    కళ కళ లాడుతోంది ? ఎవరీ శాంతి ??
    మంత్రి వర్యుల ఆరా !!
    అంతా క్షేమం ..క్షామాలూ వడగళ్ళూ
    మార్చి మార్చి వస్తూ ,పని లేని ప్రజలు
    మరి తల ఎత్తిచూడకుండా
    ఇక్కడ అంతా క్షామం ..అక్కడ క్షేమ మేనా ?

    శ్రీ శ్రీ ..మరో ప్రపంచం కబుర్లు
    అప్పుడప్పుడు వినిపిస్తూ ఉండు మీ
    మేము మటుకు ఆ దరిదాపులలో
    ఉండమని గీత మీద ప్రమాణం చేసి చెపుతున్నాం
    ఇంక నువ్వు నీ ప్రపంచం లో నిష్పూచీ గా దమ్ము లాగూతూ
    హాయిగా నిదురించు ..

    అసహాయత , నిరాశ నిండిన ఈ కవిత
    ని మటుకు ఎవరికీ అంకితం ఇవ్వను ..
    శ్రీ శ్రీ కి మటుకు అసలే కాదు ..

రాజేశ్వరి కి నివాళు లు

ఒకరు నెమ్మదిగా 
నిష్క్రమిస్తారు 
చడీ చప్పుడూ లేకుండా 
వారు చల్లిన విత్తనాలు 
మటుకు పుష్పించి 
నివాళులు అర్పిస్తూ 
ఆ రోజు తలలు 
వేలాడదీసాయి ,
జెండా అనవతమై నట్టు

మొక్క గా నో
చెట్టు గా నో బ్రతికనపుడు
అనామకులు .
రహదారిలో బాటసారులు
ఒక్కసారి ఆగి
నీడ మహత్తు ననుభవిస్తారు

ఈ రోజు
దారి పక్కన ఒరిగిన
చెట్టు కింద నీడ
మటుకు ఎవరో దొంగలించారు
ఎవరో వారెవరో ..

కాలం రక్కసి లా
కబళిస్తూ
ఆకలి తీరని కాలం కి
ఎంత మంది ని ఆహారం చేసాం ?
ఎన్ని నీడ నిచ్చే చెట్లు ?
ఎన్ని పూలు పూసే మొక్కలు ?
ఎన్ని రంగు రంగుల పూలు ?

ఎంత కనికరం లేనిదీ కాలం .
ఎంత కనికట్టూ ఈ కాలం ..
ఎంత మాయాజాలం ఈ కాలమే
నిన్నలనీ మొన్నలనీ మింగే కాల బిలం
అంచున చూపుతుంది రేపు ..

అస్తమించే సూర్యుడి కే
తెలుసు అస్తమయం తాత్కాలికం అని
ఈ కాలం మటుకు నిర్లిప్తం గా
తన పని తను చేస్తూ ..
అన్నిటికీ ఒక సమయం ఉంది అని
కాలమే ఆఖరుకి మనకి ఓదార్పు
మింగిన కాలమే ..
అంతే ..

మైదానం రాజేశ్వరి గురించి విని చదివి చలించి ..
ఈ నాలుగూ విత్తనాలు వెదజల్లుతూ
వసంత లక్ష్మి .

పూలు అమ్మే వాడు

పూలు అమ్మే వాడు
చెట్టు కింద పూలు అమ్మేవాడు
కూర్చుని
గులాబీ రెక్కల మీద
నీటి చుక్కలు జల్లుతూ 
అశాంతిగా
ఈ నాడు ఒక్క మరణమూ లేదా
ఈ గులాబీ దండల మదుపు
ఏట్లో పోసినట్టే ?
పెళ్ళి ళ్ళ సీసనూ కాదు
ఎవరూ దండ పెళ్ళిళ్ళు
చేసుకోరా ?
మల్లె పూల రాసులు
పక పక నవ్వుతూ
గుండె ల్లో గునపాలు గుచ్చుతూ
రాత్రికి పూదండ లు కొనే
మగ వారే కరువా ?
సాయి నాధుని వారమో
ఆంజనేయుని దినమో
పెద్ద మనుషుల సన్మానమో
ఏమి టీ రోజు మరీ
గొడ్డు పోయింది ?
పూలు అమ్మే వాడు
చేతికి పూల రంగు అంట లేదు
చెట్టు కింద
పూల పరిమళాలు మోస్తూ
ఎంత కాలం కూర్చుంటాడో ?
మరి ..ఆ పూలు అమ్మే వాడు .
చెట్టు నీడ ఉన్నంత వరకూ
ఉంటాడని నా నమ్మకం
ఊరికే నమ్మకం ..
హుద్ హుద్ తుఫాను కి
చెట్టు నేల ఒరిగింది
పూలు అమ్మే వాడి నీడ కూడా
పరిమళా లని నమ్ముకుని వాడు
ఇంకా పూలు అమ్ముకుంటూ నే ఉన్నాడు .
అవును వాడు ఇంకా పూలనే
నమ్ముకున్నాడు , అమ్ముకుంటూ ..

(ఎం వీ పీ కాలనీ ఉషోదయ సెంటెర్ లో
చెట్టు కూలింది ..
ఆ కూడలి లో పూలు అమ్ముకునే వారి ని
తలుచుకుంటూ )