"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

21 మార్చి, 2017

మా రాజస్థాన్‌ యాత్ర ..

మా రాజస్థాన్‌ యాత్ర గురించి రాయమని అందరూ అడుగుతున్నారు కదా ,సరే ..మరి మొదలు పెట్టనా ..(వద్దు అన్నా ఊరుకుంటారా :) అంటారా !! )
పెళ్ళిళ్ళూ అవీ ఉన్నాయని చెప్పి , నిజంగానే ఉన్నాయి లెండి ,నేను ఓ మూడు వారాల ముందే వైజాగ్ వచ్చేసాను . నా ఫ్రెండ్స్ అందరూ ,వచ్చావా !! అంటూ పెద్ద లిస్ట్ చెప్పారు ..చూడాల్సిన సిన్మాలూ , రుచి చూడవల్సిన కొత్త హోటళ్ళ భోజనాలూ , సరి కొత్త ఐసు క్రీం పార్లర్లూ అంటే మొత్తంగా సెలవు దినాలని బాగా ఎంజాయ్ చేసేయాలని పెద్ద పెద్ద ప్లాంస్ వేసేసుకున్నాం .
ఆ విషయాలు అన్నీ రాసాను కదా , మొత్తం బీరువాలో దాచి పెట్టిన పట్టు చీరలకి పని పడింది .
ఈ లోపల కుమార్ రాజస్థాన్‌ టూర్ ప్రోగ్రాం , అంటూ ఒక మైల్ పంపించాడు ,అయితే నాకున్న సవాలక్ష వ్యాపకాలలో అది విప్పి చూడ్డమే పడలేదు. అయితే తనకే అప్ప చెపితే ఇంక నేను వేరే ఏం చూసుకో అక్కరలేదు కదా ..తేడా వస్తే నాదేం లేదు బాబూ అని అనేయ వచ్చు ..:))
ఇంక వంటింట్లో వీరగా వంటలు వండుతూ ,మధ్యలో టూర్ అని చెప్పి విచ్చలివిడిగా షాపింగ్ చేసేస్తూ ,తగు మాత్రం గా వంటా ,డబ్బూ తగలబెట్టాను ..
చూస్తూ ఉండగానే 2017 వచ్చేసింది ..ఆఘమేఘాల మీద ..సరిగ్గా వీడ్కోలూ అవీ ఇవ్వనే లేదు ,2016 కి అనుకుంటూ ఉండగా అప్పుడే రెండో తారీఖు కూడా వచ్చేసింది .
ఏమిటో రాజస్థాన్‌ అని తప్ప మరే వివరమూ తెలియదు నాకు , తను షిప్ లో ఉద్యోగం చేస్తున్నప్పుడు , ఇలా వెళ్ళాలి అనగానే మొత్తం అంతా ప్లాన్‌ వేసి ఉంచేదాన్ని , ఇప్పుడు పిల్లలో ,తనో చూసుకుంటున్నారు ..అదో తృప్తి ..
ముందు రాజధాని డిల్లి కి అయిర్ ఇండియా వాళ్ళ ఫ్లైట్ , వాళ్ళిచ్చిన సాండ్ విచెస్ మహా ప్రసాదం అని తినేసాం ..నాకూ ,మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా తిండి విషయమ్లో నకరాలు ఏమీ లేవు , అవి తినం ,ఇవి తినం అన్నదే లేదు ..శాకాహారం అయితే చాలు ..
ఢిల్లి లో ఎక్కువ సమయం లేదు ,మరో ఫ్లైట్ ఎక్కి జైపూర్ చేరాం , ఒంటి గంట కల్లా .
రాజస్థాన్‌ రాష్ట్రం కి రాజధాని అయినా ,మన షంషాబాద్ అంత పెద్దది కాదు ,కానీ బాగుంది వాళ్ళ విమానాశ్రయం .
ఈ లోపలే మాకు ఫోన్‌ వచ్చింది , మాకు ఆ టూర్ వాళ్ళు మాట్లాడి పెట్టీన టాక్సి డ్రైవరు దగ్గర నుంచి . అతని పేరు గజేంద్రన్‌
సరే, బయటకి రాగానే ఎక్కువ ఆలస్యం చేయకుండా కారు వచ్చింది , ఎక్కి కూర్చున్నాం. అదే కారు మాకు టూర్ అంతా అని అప్పుడే నాకు తెలిసింది , మళ్ళీ మమ్మలిని ఉదయపూర్ అయిర్ పోర్ట్ లో దింపేవరకూ అతనే మా వాహన చోదకుడు , పెద్ద వయసులో మర్యాదగా ,బాగానే ఉన్నాడు , హిందీ యా ,ఆంగ్లమా అని మాట వరసకి ఓ ప్రశ్న అడిగేసి ,చిక్కని రాజస్థానీ యాస లో హిందీ మాట్లాడడం మొదలు పెట్టాడు , మేం ఇంక చెవులు నిక్క పెట్టి ,ఒక్కో మాట జాగ్రత్తగా వినడం మొదలుపెట్టాం ..సోనీ టీ వీ కూడా చూడం మేం , మా హిందీ అంతంత మాత్రం మరి .
విమానాశ్రయం నుంచి బయటకి వెళ్ళి పోతూ , పార్కింగ్ అంటూ ఓ వంద మా చేత ఇప్పించాడు .. మామూలుగా అయితే నేనే ఇవ్వాలి అంటూ ఓ కొసరు మాట చేర్చి , వంద యే కదా అనుకునే వాళ్ళం మేం , ఈ విధంగా అతను మా వాలకం ఏమిటో పరీక్ష చేసి , ఫరవాలేదు , అంత ఖతరా మనుషులు కాదు ,మంచి వాళ్ళే ,( అంటే !!!! చాలా అర్ధాలు ఉంటాయి మరి ) అని నిర్ధారించుకుని , జై జై అంటూ రధం కదిలించాడు .
తిన్నగా ఒకటే రోడ్డు , అటూ ,ఇటూ పచ్చని చెట్లూ ,మధ్యే మధ్యే మేమూ ఉన్నాం అంటూ తొంగి చూస్తున్న రంగు రంగుల పూల పొదలూ , ప్రభుత్వ ఆసుపత్రీ , పెద్ద హోటల్స్ , ఇలా అన్నీ ముఖ్య ప్రదేసాలనీ పరిచయం చేస్తూ కుడి వేపు చూడండి అంటే నేను ముందు మరో వేపు చూడడం ,అసలే నాకు కుడీ ఎడమా లో కొంచం అయోమయం ,అది మరి హిందీ లో అంటే నేను చూసే సరికి అది దాటి పోవడం అయ్య్యాక ,రధం ని మెల్లగా నడిపిస్తూ చూపించేడు , కుడి వేపు ఎత్తైన కొండ మీద ఓ మహల్ అందులో మహా రాణీ గాయత్రి దేవి ఉండే వారు అనీ , అలా చెప్పగానే ఆవిడ అందం ,ఆ కథలూ అన్నీ గుర్తు వచ్చి ,రాజుల సంపద అంతా రాళ్ళ పాలు అని ఏదో విన్నాను ,అబ్బ ,ఈ కొండ పైకి ఎలా ఎక్కేవారు ? అనుకోగానే ,ఏనుగుల మీద ఎక్కేవారు అని చెప్పేసాడు , ఫరవాలేదు , నా ఆలోచనల లింక్ బాగానే అందుకుంటున్నాడు అనుకుని సంతోషించాను .
ఆ కొండ మీదే బిర్లాలు కట్టిన కృష్ణ మాందిరం అదే గుడి ఉంది ,అని చూపించాడు ..
ఇలా నెమ్మదిగా అన్నీ చూపిస్తూ ,ఒక కూడలి లో తిరగ గానే మా హోటల్ వచ్చింది అని లోపలికి తిప్పాడు , ఒక సింహ ద్వారం లాంటి పెద్ద ఆర్చి లోంచి ముందుకు వెళ్ళగానే " నారాయణ నివాస్ " అనే పేరు కనిపించింది .
అది ఓ చిన్న పాలస్ ..అంటే ఒకప్పుడు ..మా పేర్లు చెప్పి , ఐ డి లు ఇచ్చి , లోపలకి తీసుకు వెళ్ళమని చెప్పేసరికే ఆకలి మొదలయింది ..
చక్కని తలపాగాలు చుట్టుకుని ,పంచలు కట్టుకున్న పని వాళ్ళు నెత్తి మీద పెట్టెలు పట్టుకుని ఓ పక్కన ఉన్న చిన్న కూపం లాంటి ఒంటి స్తంభం మేడ పైకి దారి తీసారు ..
కుర్రాడి లాగా కుమార్ చకచక ఎక్కేస్తూ ఉంటే ,ఓ నాలుగు మెట్లు పోటీగా ఎక్కి ,ఆ పై నుంచి ఆయాస పడడం మొదలు పెట్టాను ,అలా ఓ నాలుగు మడతలు ఎక్కాక ఓ గుమ్మం కనిపించి ,అమ్మయ్య అని అటు తొంగి చూస్తే , అది మొదటి అంతస్తు అమ్మా అని చిలిపి నవ్వులతో గుసగుసగా చెప్పారు , అకలికి అప్పటికే నాకు కళ్ళు బైర్లు కమ్మాయి , సరే ఎలాగో మొత్తానికి నా శరీరాన్ని గ్రావిటి కి ఎదురొడ్డి లాక్కుని చేర వేసాను , అక్కడ ఉంది ట మా రూం ..చుట్టూ డాబా , చిన్న టవర్లూ , రూం లో పెద్ద పెద్ద మీసాలతో రాజుల ఫుటోలూ , బాబోయ్ ,అని వల్ల కాదు అని గోల పెట్టాను ..
సరే లెమ్మని , మరో నేల మీద రూమ్‌ ,ఈత కొలను దగ్గరగా ఇచ్చారు , అటూ ,ఇటూ తిప్పుతూ మొత్తానికి రూం కి చేర్చారు .
సామాన్లు అలా కూలేసి ,శుభ్రమైన భోహనం కి బయలు దేరాం ,అల్ల మల్లీశ్వరి సిన్మా లోలాగే మలుపులూ ,మెట్లూ ఎక్కీ ,దిగాక వచ్చింది ..అమ్మయ్య అని కూలబడి ,ఏది ఉంటే అది పెట్టు మహప్రభో అని కూడ బలుక్కుని శరణు వేడాం ..
మా గజేందృడు ,భోజనాలు చేసి కాస్త విశ్రమించండి ,సాయంత్రం ఆరు కి వస్తాను అని సీను నుంచి నిష్కమించాడు .
ఇలా చేయండి ,అలా తినండి అంటూ మాకు ఇలా చాలా చెప్తూ ఉంటాడు అని అప్పటికి మాకు తెలియదు కదా ..
హాయిగా నడుమ వాల్చాం .
మరో పార్ట్ రాస్తాను ..కూసింత విరామం తీసుకుని

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి