"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

21 మార్చి, 2017

మా రాజస్థాన్‌ యాత్ర ..రెండో భాగం .

రాజస్థాన్‌ విహార యాత్ర .
రెండవ భాగం ..జై పూర్ ..లో మొదటి రోజు .
సరే ,ఆకలి ,విశ్రాంతి అయాయి కదా ,సాయంత్రానికి ఫ్రెష్ గా తయారు అయి సరిగ్గా ఆరు గంటలకి మా హోటల్ ముందుకి వచ్చాం , మా రధ చోదకుడు ( ఈటియోస్ కార్ ) కూడా రెడి గా ఉన్నాడు .
అలా నెమ్మదిగా నడుపుతూ ,మాకు అన్ని భవనాలు ,కూడలలు గురించి వివరిస్తూ , తిన్నగా బిర్లా మందిర్ వద్దకు తీసుకు వెళ్ళి , మమ్మలిని వెళ్ళి రమ్మాన్నాడు . సరే చెప్పులూ అవీ విప్పి ,మందిర్ లోపలకి వెళ్ళాం , సుందరమైన కృష్ణ - రాధ ల విగ్రహాలు పెద్ద వి గా నిలుచుని చిద్విలాసంగా నవ్వుతూ చూడ చక్కగా ఉన్నాయి ,విగ్రహాలు , ఫోటోలు తీయకూడదు అన్నారు ,కదా అని మేమూ తీయలేదు .
నాలుగు వేపులా కొన్ని సన్నివేశాలు కూడా చెక్కారు ..భాగవతం లోంచి . 
కొండ పైన కదా ,కొంచం చలి గా అనిపించింది .
కిందకి వచ్చాక ఒక కూడలి కి తీసుకు వెళ్ళాడు , వెనక సవాయ్ మాన్‌ సింఘ్ క్రికెట్ స్టేడియం ఉంది ట . ముందు వారి రాష్ట్రానికి చెందిన ఆర్మీ వాళ్ళ పేర్లూ , యుద్ధ సీన్లూ , కొన్ని స్పీచెస్ , అలా మొత్తం మీద మనకి ఆర్మీ అంటే ఎలాంటి త్యాగాలు చేస్తారో ,తెలిపేవిగా ఉన్నాయి చిన్న పిల్లలకి ముఖ్యంగా ఇవి చాలా స్ఫూర్తిదాయకం గా ఉంటాయి అనిపించింది .
పంచ రంగులలో మధ్యలో ఒక స్మృతి స్తంభం ఉంది , మన దక్షిణ దేశం కన్నా ఉత్తర దేశం లో వారు యుద్ధాలు అవీ చూసారు .. అని అనుకున్నాం ..అందుకే ఈ స్మృతి స్తంభాలూ అవి నిర్మించారు .
రాత్రి ఎనిమిది దాటింది , మా భోజనం సమయం అయిపోయింది ,ఠంచను గా మాకు సమయాలు చెప్పేస్తూ ఉంటాయి ..మా శరీరాలు ..అంతే ..
విరాసట్ అని ఒక మూడంతస్థుల భవనం హోటల్ కి తీసుకు వెళ్ళాడు , కింద అంతస్థులో మనం నేల మీద ఆని ఉండే చిన్న పీటల మీద కూర్చుంటే వారి సంప్రదాయ పద్ధతి లో నృత్యాలూ అవీ చేస్తూ పెడతారు అని చెప్పారు ..భోజనం .
మాకు అంత భారీ నాటకం వద్దు అనుకుని ,మరో అంతస్తు లో సంప్రదాయ రాజస్థానీ థాళీ భోజనం తీసుకున్నాం ...ఆ గట్టి పకోడీ లాంటి పదార్ధాలు మరీ అంత రుచించలేదు ,మిస్సీ రోటీ ,మరి కొన్ని రోటీలు విరివిగా ఇచ్చి ,ఒక చిన్న కటోరి గిన్నెలో తెల్లని రైస్ పెట్టాడు ..అమ్మయ్య ..మన అన్నం ఉంది కదా అని మొహం విప్పారి ,మొత్తానికి ఖాళీ చేసాం .
అడుగడుక్కి మెరిసిపోయే చిత్రాలూ ,అద్ద్దాలూ , మనం కొనాలని కళ్ళకి అడ్డం పడిపోతూ పెట్టారు కానీ ,ప్రేమగా చేయి పట్టుకుని కిందకి నడిపించేసాడు ,తను ..నా సంగతి తెలిసి .
ఈ రోజుకి మా విహారాలు పూర్తి అయాయి ..ఇంక మా హోటల్ కి వెళ్ళి నిద్ర పోడమే .. మేం మా వయసు కి తగ్గట్టు ,నెమ్మదిగా ,తొందర పడకుండా చూడాలి అని నిశ్చయించుకున్నాం ..అందుకే మరి రాత్రి జైపూర్ అంటూ ఉత్సాహపడలేదు ..
మరో రోజు ..మరి రేపే ..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి