"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

17 జన, 2018

యే మాయ చేసావే క్రీమూ ?

కారుని   పార్కింగ్ లోకి తిప్పి విసురుగా బ్రేక్ వేస్తూ ఆపేసరికి ,బంపర్కి తగిలికీచుమంది
అబ్బా ,నా కోపం అంతా ఈ నాలుగు చక్రాల వాహనం మీద చూపిస్తే ఎలా ? అసలు కారణమైన   వాసు మీద చూపించాలి కానీ ,’ అని  అనుకుంటూనే ..మళ్ళీ అనుకోకుండా కార్ డోర్ విసురుగా శబ్దం తో మూసుకోవడం జరిగి పోయింది .
చా!  ఈ రోజు నా మనసుకేదో అయింది  వెంటనే  కూల్ చేసుకోవాలిఅనుకుంటూ ఒకసారి హాండ్ బాగ్ తెరిచి  అద్దంలో  నా మొహం చూసుకున్నాను .
ఆఫీసు పనితో   అలసిపోయిన మొహం వాడిపోయి కనిపిస్తోంది .   నుదుటి మీద చర్మం కళా విహీనంగా  ఉండి కళ్ళ కింద నల్లటి వలయాలు చుట్టుకున్నాయి . నేనేనా ? అని ఉలిక్కిపడ్డాను . ఛ నా మీద నాకు తగ్గిపోయిన శ్రద్ధకు అద్దం పడుతోంది అద్దంలో నా రూపం . ఏది ఏమైనా కానియ్ ..ఇవాళ ఎలా అయినా ఆ
' ఓలే '  ప్రాడక్ట్ కొనేయాలి. వెయ్యి రూపాయిలట.  అయితే ఏమయింది?
యాభైవేలు సంపాదిస్తున్నాను . ఇంకా ఏమిటి ? వెనక ముందు  ఆలోచన?
సామాన్లు పడేసుకుని తోయడానికి బండి పట్టుకుని  షాపింగ్ మాల్లోకి ప్రవేసించాను . ఇదో పెద్ద   సూపర్ మార్కెట్ . ఏ టు జెడ్ అన్ని సరుకులు ఒక్క చోటే దొరుకుతాయి అని ఈ మధ్య ఇక్కడికే వస్తున్నాను.ఓ పైసా పోతే పోయింది ప్రాణంకి హాయిగా ఉంది .మరే వీధి చివర పచారీ కొట్టు ముఖం చూడక ఎన్నాళ్ళై పోయింది కదూ ? నాలో నేనే స్వగతంలా అనుకున్నాను . 
మళ్ళి వాసు గుర్తొచ్చాడు   ఆ వెనకే , మర్చిపోయిన కోపమూ  ముంచుకొచ్చింది
అయినా వాసుకి అసలు బుద్ది లేదు. చదువుకుని ఉద్యోగం చేస్తున్న భార్యని అర్ధం చేసుకోడం అస్సలు రాదు తనంటే అదో అలుసు కాబోలు. మునుపు షాపింగ్ అంతా కలిసే చేసేవారు. నువ్వునాలా కాదు చాలా బాగా  శ్రద్ధగా షాపింగ్ చేస్తావు  అసలు యే పని అయినా నీకు నువ్వే సాటి  అనుకో ..’ అంటూ , ఓ పొగడ్త నా మొహాన పడేసి  మెల్లమెల్ల గా అన్ని పనులు నా మీద వదిలేసాడు.
తనెంతో   తెలివైనది అనుకుందే కాని ,ఆ మాటల  వలలో  పడిపోయిన  అమాయకురాలు తనని  ఇదిగో ఇప్పుడిప్పుడే తెలుస్తోంది .
ఇద్దరి పిల్లల చదువు ,స్కూల్ ఫీజ్  కట్టడం దగ్గర నించి ,వారి చదువులు ,ఆరోగ్యాలు ,అవసరమైతే  డాక్టరు దగ్గరికి తీసుకు వెళ్ళడం ,ఇవి కాక ఉదయమే హడావిడిగా వంటలు, లంచ్ బాక్సలు అన్నీ నా పైనే . సహాయం తీసుకుందాం అంటే ,ఎప్పుడూ తన సమస్యలు చెప్పి బిజినస్ అంటే ఇలాగే ఉంటుంది ,మన మీద నమ్మకం కుదిరే వరకూ శ్రమించాలి , తప్పదు ,నీ జీతం నిలకడ గా ఉంది కాబట్టే  నేను ఈ రిస్క్ తీసుకోగలిగాను ,నా ఇంజనీరింగ్ ప్రతిభ అంతా మరెవరికో అమ్ముకోవడం ఎందుకు ? ఈ ఫాక్టరీని ఏ రేంజ్కి తీసుకు వెళతానొ చూస్తూ ఉండు అంటాడు . పైగా , ‘అనంతా ,నీ అనంత మైన ప్రేమతో నాకు శక్తి నివ్వవా ?’ అంటూ ,ఎలాగో నా కోపాన్ని మరిపిస్తాడు. అయినా అంతా  మన కోసమే కదా అంటూ ఉంటాడు ,నిజంగా నిజమేనా ?

నా జీతంతో ప్రస్తుతం ఇల్లు నడుస్తోంది , పిల్లల ఖర్చులు పెరిగి పోతున్నాయి , స్కూల్ కాక, పైన మరి కొన్ని ఎక్సట్రా  క్లాసులు వాటి ఫీజులు , మధ్యలో వచ్చే పుట్టినరోజు పార్టీలు , పండగలు ,కానుకలు ,ఔటింగ్స్ , అన్నిటికీ డబ్బు కావాలి ,ఎంత పొదుపుగా ఖర్చు పెట్టినా నెలకి యాభై వేలు హుష్ అంటూ ఎగిరిపోవడమే కనిపిస్తోంది ..

నా పర్సనల్ ఖర్చులన్నీ పక్కకి పెట్టేస్తున్నాను ,కొత్త డ్రెస్సులు కొని ఎన్ని నెలలు అయింది ?
వాసు  ఫాక్టరీకి ఆర్డర్లు రావడం ఎప్పుడు మొదలవుతుందో ?

ఇవే ఆలోచనలు .రక రకాలుగా డబ్బు సమస్యలు బుర్రని ఎలా తినేస్తాయో ? నా చేతులు యాంత్రికంగా కూరలు ,పళ్ళు ,బ్రెడ్ ,జామ్లు , పప్పులు , సర్ఫ్ పొడి ,విమ్ సోప్ ,ఇలా వేసుకుంటూ తోపుడు బండిలో కాస్మెటిక్స్ దగ్గరకి వచ్చి బ్రేక్ పడినట్టు ఆగిపోయాను ..
ఐశ్వర్యా రాయ్ ,కరిష్మా , తల్లులు అయిపోయిన స్టార్స్ ఇంకా ఎలా మెరిసి పోతున్నారో ,అంటూ ఈ ప్రాడక్ట్స్ చూపిస్తున్నారు ..
వయసు చేతితో తీసినట్టు తీసేస్తుందిట ,నిజమా ?
అనంతా ! నువ్వు ఇలా ఫూల్లా ఎప్పుడు అయిపోయావు ,ఆ ఆడ్స్ అన్ని ఫూల్స్ కి అని వాదిస్తావు కదా ,అందరితో.
 ఇందాక అద్దంలో కనిపించిన నా జిడ్డు ,అలసి పోయిన మొహం గుర్తు వచ్చి ,అక్కడ ఆగి, చేతి లోకి తీసుకుని సీసా మీద రాసి ఉన్న విషయం చదువుతున్నట్టు నటిస్తూ ,ఖరీదు ఎంతో అనుకుంటూ అటు ఇటు చూస్తున్నాను ..
హలో షాపింగ్ కేనా ? అంటూ పలకరింపు ,ఎంత సిల్లి ప్రశ్న అనుకుంటూ పక్కకి చూస్తే మా ఫ్లాట్స్ లో నే ఉండే సుమ కనిపించింది నవ్వుతూ. మీరో అన్నాను ,ఆవిడ నవ్వేసింది ..

సుమా అని పిలుస్తూ భర్త రమేష్ వచ్చి ,నమస్తే అండీ అంటూ ఒక మాట నా వేపు వేసి , ఇంక చాలు సుమా ,ఇప్పటికే బండి నిండి పోయింది , ఇంక జాగా లేదు ,ఇవన్నీ సర్దేసరికి అవుతుంది నీకేం ? అలసి పోయాను షాపింగ్ తో అంటూ కూర్చుంటావు ..
అయినా ఆ బల్ల నిండా వంద రకాల క్రీములు ,పౌడర్లు ,పాక్ లు ,ఇంకా ఏమిటి కొంటావు ? పద పద ,అని తొందర పెడుతూ ,నా వేపు ఒకసారి చూసి బండి తోస్తూ ముందుకు నడిచాడు ..
సుమ నేను నిలబడి ఉన్నాం .
నా చేతిలో ఆ వయసు తగ్గించే క్రీమ్ సీసా వైపూ  నా వైపూ  చూస్తూ , “చూసారు కదా ,ఆయన మాటలు ధోరణి ? నాకు జాబ్ లేదు కదండీ మీలాగా  అందుకని , దేనికీ స్వతంత్రం ఉండదు  మీరు నాకొక సాయం చేయాలి. ఈ క్రీమ్ చాలా బాగా పని చేస్తుందిటండీ, నా ఫ్రెండు చెప్పింది .తను వాడింది .చాలా యంగ్ గా కనిపిస్తోంది ఇప్పుడు అంటూ..గొంతు తగ్గించి వెయ్యి రూపాయలు అండీ ,నాకు తెలుసు ,మీరు నా తరఫున ఒకటి తీసుకోండి ,నేను తర్వాత మీ ఇంటికి వచ్చి ,డబ్బులిచ్చి తీసుకుంటాను  ,మగ వాళ్ళు ఇలా ఏదో అంటూ ఉంటారు ,వాళ్ళ కోసం ఐతే షేవింగ్ క్రీములు ,పెర్ఫూమ్ లు కొనుక్కోరా ? ఆక్స్ లు అవి అంటూ నవ్వింది ..
నాకూ నవ్వు వచ్చింది ,పాపం ఆ ఆడ్లో లాగా ఆడవారు వచ్చి మీద పడిపోతారు అని నిజంగా నమ్ముతారా మగ వారు ? ఎంత మూర్ఖులు ?
సుమ నా ద్రష్టి లో మోడల్ మదర్ . ఎంత బాగా చేస్తుందో వంటలు ? పుట్టిన రోజులు కేకులు అవీ నా పిల్లలకి నేను అవన్నీ సొంతంగా ఎప్పటికీ చేయలేను నాకు అంత సమయమే ఉండదు మరి ..

ఇదేమిటి ? ఇలా అడిగింది ? నేనూ ఒకటి తీసుకోనా ? కార్ట్ లో రెండు వేసాను , మెల్ల గా బట్టర్ , ఎగ్స్ తీసుకుంటూ ఒక వరస లో నిల్చున్నాను ,రమేష్ తో సుమ ఏదో వాదిస్తూ కనిపించింది , ఇప్పటికే ఈ నెల చాలా ఖర్చు అనే మాటలు గాలిలో తేలి నా వేపు వచ్చాయి ..
సుమ తల పక్కకి తిప్పుకుని ,కళ్ళు తుడుచుకున్నట్టు అనిపించిది , అయ్యో ,ఇదేమిటి ఈ క్రీమ్ ఏదో చాలా ఘర్షణకి కారణం అయినట్టుందే ..

నా బిల్లింగ్ అవుతోంది , నా ముందున్నడిస్ప్లే మీద మొత్తం ఎంత అయిందో కనిపిస్తోంది , నా గుండె గొంతు లోకి వచ్చింది ,ఎలా పెరిగి పోయాయి అన్నిటి ఖరీదులు ? ఏది మానేయడం ? పిల్లలకే లోటూ ఉండకూడదు కదా , తిండి విషయంలో పొదుపు అన్న మాటే లేదు ,వాసు కూడా ఎప్పుడూ అదే అంటాడు , పిల్లలంటే ఎంత ప్రేమ తనకి ?

ఓలే క్రీమ్ సుమ కోసం ఒక్కటి ఉంచి ,రెండోది తీసి ,పక్కన పెట్టి ,అమ్మయ్యా అని నిట్టూర్చాను ..
వెయ్యి తగ్గినా తగ్గినట్టే కదా , తన పర్సు లోంచి ఖర్చు పెడితే సుమ కి కూడా తెలిసేది ఏది అవసరమైన ఖర్చో ,ఏది కాదో !

నా చదువు కి సార్ధకత నా ఉద్యోగం అని ఒప్పించి నన్ను ప్రోత్సాహపరిచి , ఉద్యోగానికి పంపించిన వాసు మీద ఒక్కసారి ప్రేమ పొంగి పొర్లింది ..
ఇంటికి వెళ్లి ముఖం చల్ల నీళ్ళతో కడుక్కుంటే ఈ జిడ్డు పోయి ,నా మొహం ఫ్రెష్ గా అయిపోతుంది .ఏ క్రీమ్ అక్కర్లేదు నాకు అనుకుంటూ ,ఉత్సాహం గా బండి తోసుకుంటూ ,కారు వద్దకు వచ్చేసాను .
https://mail.google.com/mail/u/0/images/cleardot.gif


1 కామెంట్‌: